Begin typing your search above and press return to search.

దసరాకు జాతీయ పార్టీ... ఆ మీదట‌ అసెంబ్లీ రద్దు...?

By:  Tupaki Desk   |   3 Oct 2022 10:30 AM GMT
దసరాకు జాతీయ పార్టీ... ఆ మీదట‌ అసెంబ్లీ రద్దు...?
X
రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్ పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగబోతున్నారు అని అంటున్నారు. ఆయన ఆలోచనలు బీజేపీకి చిక్కకుండా దక్కకుండా ఉంటాయని చెబుతున్నారు. కేసీయార్ అనుకున్న విధంగానే జాతీయ పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ జాతీయ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ డిసెంబర్ లోగా పూర్తి అయితే ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కేసీయార్ రెడీ అవుతారని అంటున్నారు.

అంటే కేసీయార్ మదిలో ఉన్న ఆలోచన మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల మధ్యలో తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు పెట్టించుకుని మూడవసారి ముచ్చటగా గెలిచి ఇక్కడ అధికారం పదిలపర్చుకోవాలన్నదే మాస్టర్ ప్లాన్. ఆ తరువాత 2024 లోక్ సభ ఎన్నికలకు గట్టిగా ఏడాది టైం ఉంటుంది. దాంతో ఇక ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా దేశమంతా కేసీయార్ చుట్టేస్తారు అని అంటారు.

ఇక షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో ఎన్నికలు జరిగితే మాత్రం కేసీయార్ జాతీయ రాజకీయానికి ఇబ్బంది కలుగుతుందని లెక్కలేస్తున్నారు. 2023 డిసెబ్మర్ లో తెలంగాణకు ఎన్నికలు అంటే కేసీయార్ తన సమస్త శక్తులనూ తెలంగాణాకే ధారపోయాల్సి ఉంటుంది. ఇక ఇంత ఎక్కువ టైం ఇస్తే బీజేపీ సహా కాంగ్రెస్ సైతం గట్టిగా బలపడే అవకాశాలు ఉంటాయి.

అలాగే ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉంటే అది కూడా మరింతగా పెరుగుతుంది. అందువల్ల కేసీయార్ తెలివిగానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఆయనకు ఇపుడు అత్యంత అవసరం. ఈ ఒక్క ఉప ఎన్నిక ఏకంగా తెలంగాణా రాజకీయాన్ని దేశ రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని ఆయన భావిస్తున్నారు.

మునుగోడులో టీయారెస్ గెలిస్తే ఆ ఊపులోనే ఆయన అసెంబ్లీని రద్దు చేసి తమకే జనంలో మద్దతు ఉందని జబర్దస్తుగా చాటి చెప్పుకుంటారు. ఆ వేడి అలా ఉండగానే ముందస్తు పెట్టి ఆ రాజకీయ లాభాన్ని పూర్తిగా వాడుకోవాలని చూస్తారని అంటున్నారు ఇక ఇప్పటికి వరసగా రెండు ఉప ఎన్నికలతో పాటు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి మునుగోడుతో బ్రేక్ వేయడమే కేసీయార్ మార్క్ మాస్టర్ ప్లాన్. అంటే ముందు ఉప ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా చివరి పంచ్ మాదే అని చాటి చెబుతూ ఆ విజయ గర్వంతో ముందస్తుని ధీమాగా ఎదుర్కొంటారు అని అంటున్నారు.

ఆ మీదట వచ్చే ఏడాది మేలో తెలంగాణాకు ఎన్నికలు పెట్టించుకుని హ్యాట్రిక్ విజయాన్ని తెలంగాణాలో సొంతం చేసుకుని జాతీయ స్థాయిలో తన దిగ్విజయ యాత్రను కొనసాగించడానికి కేసీయార్ సూపర్ ప్లాన్ వేసారని చెబుతున్నారు. తెలంగాణాలో మూడు సార్లు గెలిచిన పార్టీగా బీజేపీని ఢీ కొట్టి పక్కకు నెట్టిన పార్టీగా జాతీయ స్థాయి రాజకీయాన్ని తన వైపు సులువుగా తిప్పుకోవచ్చు అని కేసీయార్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మునుగోడులో ఉప ఎన్నికల తరువాత కీలకమైన పరిణామాలు తెలంగాణాలో చోటుచేసుకోనున్నాయి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.