Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ పార్టీకి గులాబీ జెండా ఓకే.. 'కారు' మాటేంటి?

By:  Tupaki Desk   |   10 Sep 2022 4:33 AM GMT
కేసీఆర్ జాతీయ పార్టీకి గులాబీ జెండా ఓకే.. కారు మాటేంటి?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనున్న కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ పార్టీ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ అధినేత కుటుంబానికి చెందిన సొంత మీడియాలో జాతీయ పార్టీకి గులాబీ బాస్ ఎంట్రీ ఇస్తున్న వైనాన్ని పేర్కొన్న నేపథ్యంలో..

ఇప్పుడు కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టటం.. దాన్నికొనసాగించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేయాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు పార్టీల్ని తన కొత్త పార్టీలో కలిపేయటం ద్వారా.. దానికో ప్రత్యేకతను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొత్త పార్టీకి సంబంధించిన జెండా కచ్ఛితంగా పింక్ కలరే ఉంటుందని చెబుతున్నారు.

అన్నింటికి మించి.. కొత్త జాతీయ పార్టీ ఎన్నికల గుర్తుగా ఏది ఉండాలన్న దానిపై.. 'కారే' అని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కారును వదులుకోకూడదన్న భావన వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. తమకు కలిసివచ్చిన గులాబీ జెండాను ఎలాగూ తప్పక ఉంటుందని.. పార్టీ గుర్తు విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ ఉందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇరత పార్టీల్లో వేటికైనా కారు గుర్తు ఉందా? అన్న ఎంక్వయిరీ ఇప్పటికే మొదలైనట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ ఏ పార్టీకి కారు గుర్తును కేటాయించకుండా ఉంటే.. దాన్ని తాము తీసుకోగలుగుతామా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. ఈ విషయాన్ని చూడాల్సిందిగా కేసీఆర్ ఇప్పటికే కొందరికి ఆ భాధ్యత అప్పజెప్పారని.. దానికి సంబంధించిన వివరాల్ని సేకరించే పనిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో తమకు విజయాల్ని తెచ్చి పెట్టిన కారు గుర్తును వదిలిపెట్టుకోకూడదన్న భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.