Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్టేనా?

By:  Tupaki Desk   |   14 Jun 2022 6:34 AM GMT
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్టేనా?
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతోపాటు జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులను కేసీఆర్ కలసి వచ్చారు. అలాగే కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతోనూ భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో తన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్‌.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

జూన్ 23 వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ వ్యవహరిస్తారని అంటున్నారు.

‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్‌ఎస్‌ అవతరించే పక్షంలో.. రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే ఆ పార్టీ కొనసాగనుంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్‌ బ్యూరోను కేసీఆర్‌ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్‌ జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశాక జూలై మొదటివారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనాన్ని తరలిస్తారని సమాచారం. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉండటంతో ఆ రాష్ట్రాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

ఇక కేసీఆర్ జాతీయ పార్టీకి కారు గుర్తే ఉంటుందని చెబుతున్నారు. అయితే పార్టీ పతాకం మాత్రం కొంత విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని చెబుతున్నారు. ప్రధానంగా రైతుల సమస్యలు, వారి సంక్షేమానికి ప్రాధాన్యతపై ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం.