Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్‌తో జ‌గ‌న్‌, బాబు స‌హా ష‌ర్మిల‌కు మేలేనా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 1:30 AM GMT
బీఆర్ ఎస్‌తో జ‌గ‌న్‌, బాబు స‌హా ష‌ర్మిల‌కు మేలేనా?
X
రాజ‌కీయంగా తీసుకునే కొన్ని కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేస్తుండ‌డం ఇటీవ‌ల కాలంలో కొన్ని చోట్ల క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ఇదే కోవ‌లో ప్రత్య‌ర్థి పార్టీల‌కు మేలు చేస్తుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కేవ‌లం తెలంగాణ కోసం.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన‌ టీఆర్ ఎస్ పార్టీ.. ఇప్పుడు భార‌త రాష్ట్ర‌స‌మితిగా ఆవిర్భ‌వించింది. జాతీయ‌స్థాయిలో త‌న గ‌ళం వినిపించేందుకు దీనిని వేదిక‌గా చేసుకుని.. కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

ఇత‌ర రాష్ట్రాల్లో దీని ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ.. కేసీఆర్ సొంత రాష్ట్రం తెలంగాణ‌, పొరుగు రాష్ట్రం ఏపీల్లో మాత్రం ఒకింత వ్య‌తిరేక ఫ‌లితాన్ని ఆయ‌న మూట‌గట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని.. అధికారంలోకి వ‌చ్చారో.. ఆ సెంటిమెంటు ఇక వీగి పోతుంది. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో ఏపీకి చెందిన పార్టీలు హ‌ల్చ‌ల్ చేసేందుకు అవ‌కాశం ఇస్తుంది. పోనీ.. ఏపీలో అయినా.. ఆయ‌న బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉందా.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఫ‌లితంగా బీఆర్ ఎస్‌కు ఆదిలోనే హంస‌పాదు మాదిరిగా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుంది..?

బీఆర్ ఎస్ పార్టీని కేసీఆర్ జాతీయ స్థాయిలో విస్త‌రిస్తారు. అంటే.. ఇక‌, ఇది తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీగా ఆయ‌న చెప్పుకొనే ఛాన్స్ లేదు. ఇదేస‌మ‌యంలో ఇత‌ర పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ , టీడీపీ, ష‌ర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీలు.. తెలంగాణ‌లో విస్త‌రించినా.. తెలంగాణ వాదాన్ని వినిపించి.. వాటిని క‌ట్ట‌డి చేసే ప‌రిస్తితి కేసీఆర్ కు ఉండ‌దు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయ‌న జాతీయ నాయ‌కుడు. అన్ని ప్రాంతాలు.. అన్ని రాష్ట్రాల‌కు కూడా ఆయ‌న నాయ‌కుడే.. సో.. తెలంగాణ వాదాన్ని ఆయ‌న విస్మ‌రించ‌క త‌ప్ప‌దు. అలాంటప్పుడు.. ఇక‌, తెలంగాణ సెంటిమెంటును ఆయ‌న ప‌క్క‌న పెట్టేయ‌క‌త‌ప్ప‌దు ఇది అంతిమంగా.. తెలంగాణ‌లో ఈ పార్టీలు.. పుంజుకునే అవ‌కాశం ఎక్కువ‌. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పార్టీల‌ను పుంజుకోకుండా చేసిన కేసీఆర్ బీఆర్ ఎస్ కార‌ణంగా చేతులు క‌ట్టుకుని చూస్తూ.. ఉండిపోక త‌ప్ప‌దు.

ఏపీలో ఏం జ‌రుగుతుంది?

బీఆర్ ఎస్ పార్టీని జాతీయ స్తాయిలో విస్త‌రించాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు తొలి అడుగులు ఏపీపైనే వేయాల‌ని ఉంది. తెలుగు మాట్లాడే వారిని ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోవాలి. పైగా త‌న రాష్ట్రంలో కేవ‌లం 17 పార్ల‌మెంటు స్థానాలు మాత్ర‌మే ఉన్నాయి. అదే ఏపీలో అయితే.. ఏకంగా పాతిక సీట్లు ఉన్నాయి. సో.. ఆయ‌న‌కు ఏపీలో అడుగు పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి అయితే.. ఇది అంత తేలిక కాదు.. ఏపీ వ్య‌తిరేక పునాదుల‌పైనే ఆయ‌న పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ద‌రిమిలా.. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఏం చెబుతారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో ఏపీలో అదికారంలోకి రావాల‌నుకున్న టీడీపీ, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీలు.. త‌మ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా.. కేసీఆర్ త‌మ‌కు అడ్డంకి కాకుండా.. ఆయ‌న‌పై ప్రాంతీయ వాదిగా.. ఏపీ విచ్చిన్న వాదిగా కూడా ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి.

కేసీఆర్ వ‌ల్లే రాష్ట్రం విడిపోయి.. మ‌న‌కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయ‌ని.. కాబ‌ట్టి.. బీఆర్ ఎస్‌ను విశ్వ‌సించొద్ద‌ని ప్ర‌చారం చేసే అవ‌కాశం మెండుగా ఉంది. దీనిని ఎదుర్కొన‌డం కూడా కేసీఆర్‌కు సాధ్యం కాదు. ఎందుకంటే.. ఆయ‌న చేసిన ప‌ని అదే. ఇక‌, జ‌లాల విష‌యంలోనూ.. రెండు రాష్ట్రాల‌మ‌ధ్య వివాదం ఉంది. దీనికి కూడా ఆయ‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి. విభ‌జ‌న అంశాల‌పై కూడా త‌న వైఖ‌రిని వెల్ల‌డించాలి. ప్ర‌త్యేక హోదా ఇస్తే.. త‌మ‌కు కూడా అంతే ప్ర‌యోజ‌నం ఇవ్వాల‌న్న‌.. త‌న బెట్టును విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇక‌, పోల‌వ‌రం విష‌యంలో ఆయ‌న ఏం చేస్తారో.. చేయ‌నున్నారో వివ‌రించాలి. ఇవ‌న్నీ.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు గండి కొట్టే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చెప్పినా.. ఆయ‌న‌కు ప్ర‌మాద‌మే. సో.. ఏపీలో బీఆర్ ఎస్‌కు ఇవ‌న్నీ అగ్ని ప‌రీక్ష‌లే!

ఓట్ల పోల‌రైజేష‌న్ చూస్తే..

ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అనుస‌రించిన ఓట్ల పోల‌రైజేష‌న్ లెక్క వేరు. ఇక‌పై లెక్క‌వేరుగా ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ముస్లింల ఓటు బ్యాంకు త‌న‌కు ప‌డ‌క‌పోయినా.. త‌న మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు ప‌డేలా.. కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌క్రం తిప్పారు. కానీ, ఇది ఏపీ వంటి ఇత‌ర రాష్ట్రాల్లో కుద‌ర‌దు. సో.. ఆ ఓట్ల‌న్నీ కూడా.. కేసీఆర్‌కు దూర‌మై.. ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌కు ద‌క్క‌నున్నాయి. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా.. కేసీఆర్ వ్యూహంతో టీడీపీ, వైసీపీ, ష‌ర్మిల‌ల‌కు ప్ర‌యోజ‌న‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.