Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయం వ‌ర్సెస్ బీజేపీ లోక‌ల్ పాలిటిక్స్‌

By:  Tupaki Desk   |   23 Feb 2022 1:30 AM GMT
కేసీఆర్ జాతీయ రాజ‌కీయం వ‌ర్సెస్ బీజేపీ లోక‌ల్ పాలిటిక్స్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, పోరాట యోధుడు.. కేసీఆర్ జాతీయ రాజ‌కీయం సాంగ్ అందుకున్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ ఒక సారి ఈ ప్ర‌య‌త్నం చేసినా..ఇ ప్పుడు మాత్రం గ‌ట్టిప‌ట్టుద‌ల‌తోనే ముందుకు సాగుతున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎదుర‌వుతున్న ఒత్తిడి, కేంద్రంలోని బీజేపీ నేత‌ల మాట‌విన‌ని వైఖ‌రి నుంచి పుట్టిన జాతీయ రాజ‌కీయం.. కేసీఆర్‌కు ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది చ‌ర్చ‌గా మారింది. కేసీఆర్ జాతీయ రాజ‌కీయంపై బీజేపీ నేత‌లు కూడా కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప‌ని అయిపోయింద‌ని.. అందుకే ఏదో ఒక వంక‌తో త‌న వైఫ‌ల్యాన్ని క‌ప్పుపుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. బీజేపీ నేత‌లు అంటున్నారు.

త‌న ప‌ని తాను చేస్తూ..

అంతేకాదు.. ఇన్నాళ్లు గుట్టుగా కేసీఆర్ దోచుకున్న ప్ర‌జాధ‌నాన్ని దాచుకునేందుకే జాతీయ ముచ్చట తీసుకొచ్చారని. ఇదంతా కేసీఆర్ డైవర్షన్ గేమ్ అని…అవినీతి పాలనపై ఫోకస్ పెరగకుండా.. జనం మైండ్‌ను పాలిష్ చేస్తున్నరంటూ కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ స‌హా ప‌లువురు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. అయితే.. వీటిని ఏమాత్రం ఖాత‌రు చేయ‌ని.. కేసీఆర్.. త‌ను చేయాల‌నుకున్న‌ది చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ.. బంగారు భార‌త్ కోస‌మే త‌న ప్ర‌య‌త్న‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

సెంటిమెంటు రంగ‌రించి..

కులాల మధ్య..మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ దందా నడుపుతున్నారని…దాన్ని పారదోలే టైంమొచ్చిందంటూ బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతోందని.. అభివృద్ధిలో మనం ఒకర్ని రోల్‌మోడల్‌గా కాదు…మనమే ఇతర దేశాలకు రోల్‌మోడల్‌గా ఉండాలని అన్నారు. భవిష్యత్‌లో అలాంటి అభివృద్ధిని చూడబోతున్నామని.. అందుకు మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజలను త‌న‌వైపు తిప్పుకొనే మ‌రో సెంటిమెంటుకు ఆయ‌న ప్రాణం పోశారు. అంతేకాదు.. తెలంగాణ బిడ్డ జాతీయ రాజ‌కీయాల్లోకి పోకూడ‌దా? అని ఎదురు ప్ర‌శ్నించారు.

బీజేపీ.. భీక‌రాస్త్రాలు!

అయితే కేసీఆర్ జాతీయ రాజ‌కీయంపై బీజేపీ నేత‌లు భీక‌రాస్త్రాలే సంధిస్తున్నారు. అవినీతి డబ్బును దాచుకునేందుకు…ప్రజల ఫోకస్‌ను మరల్చేందుకు కేసీఆర్ తెలివిగా జాతీయ రాజకీయాలంటున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఫ్రంటు అంటూ తిరిగే వాళ్లకు గతంలో ఎలాంటి గతి పట్టిందో చంద్రబాబును ఉదహరిస్తూ కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ``ఫ్రంటు..ప్రంటు అంటూ టెంటులేసినోల్లంతా…ఇప్పుడా టెంటు కూడా లేకుండా పోయిన్రు`` అని బండి నిప్పులు చెరిగారు. తుకడే గ్యాంగ్ సభ్యులతో కలిసి రాజకీయాలు చేస్తే దేశం పట్టించుకుంటుందా అంటూ ఎద్దేవా చేశారు.

ముంబైతో మొద‌లు!

జాతీయ రాజకీయాల్లో పాగా వేయ‌డంతోపాటు.. మోడీ హ‌ఠావో నినాదంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. స‌రంజామా సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఇందులో భాగంగా మొదటి పర్యటన ముంబైతో మొదలుపెట్టారు. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ ఠాక్రేతో రాజకీయ విందు జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ కు పూర్తి మద్దతిస్తామని ఉద్ద‌వ్‌ హామీ ఇచ్చారు. అలాగే సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పవార్ కూడా కేసీఆర్ పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు.

వారిని న‌మ్మ‌డం సాహ‌స‌మేనా?

నిజానికి ఉద్ద‌వ్‌, ప‌వార్‌, కేసీఆర్‌ వ్యవహారాలను గమనిస్తే ప్రధాని మోడితో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతోంది తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క‌రే. ఠాక్రే ఇంతవరకు మోడీకి వ్యతిరేకంగా పెద్దగా చేసిన ప్రకటనలు కూడా ఏమీ లేవు. పైగా .. తేడా వ‌స్తే.. కాంగ్రెస్‌తో క‌టీఫ్ చేసుకుని మ‌ళ్లీ బీజేపికి జై కొట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాగే శరద్ పవార్ అయితే అసలు మోడీ గురించి ఎప్పుడు పెద్దగా నోరు విప్పలేదు.

పైగా.. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇస్తే.. మోడీని తిరిగి ప్ర‌ధానిని చేసేందుకు ఈయ‌న క్షేత్ర‌స్థాయిలో ప‌రుగులు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. సో.. వీరిద్ద‌రినీ న‌మ్మ‌డం అనేది కేసీఆర్‌కు దుస్సాహ‌స‌మే అవుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌రో మార్గం..
ఈ నేపథ్యంలోనే బీజేపీ సానుభూతి లేని పార్టీలను ఏకం చేసేపనిలో పడ్డారు కేసీఆర్. 2024 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, తదుపరి రాష్ట్రపతికి ఎన్నికలు జూన్-జూలైలో జరగనున్నందున రాష్ట్రపతి భవన్‌లోకి తమకు నచ్చిన వ్యక్తిని తీసుకురావాలని వారి తక్షణ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రపతి అభ్యర్దిత్వం కోసం కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్‌.

ఎన్సీపీ అధినేత శరదపవార్‌ను అభ్యర్దిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మరోసారి చర్చించేందుకు.. త్వరలో హైదరాబాద్‌లో అందరం కలిసి .. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ముంబైలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీజేపీతో తెగిన బంధం!
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అతని పార్టీ.. అనేక సందర్భాలు గతంలో అండగా నిలిచింది. బీజేపీతో కేసీఆర్ రహస్య పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ తరచుగా ఆరోపిస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీ దూకుడు, కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు ఏకంగా.. అమిత్ షా రావ‌డం వంటివి టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడంతో రెండు పార్టీల మ‌ధ్య‌ విభేదాలు తలెత్తాయి.

ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఎవ‌రు ఎన్ని విధాల క‌లిసి వ‌చ్చినా.. కాంగ్రెస్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, కాంగ్రెస్‌ను క‌లుపుకొని పోతే.. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డే ప్ర‌శ్న వ‌స్తుంది. పైగా.. కాంగ్రెస్ విష‌యంలో కేసీఆర్ చేసిన త‌ప్పులు కూడా ఉన్నాయి. ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారిని త‌న పార్టీలోకి తీసుకుని మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. సో.. కాంగ్రెస్ అందుకే కేసీఆర్‌వైపు చూడ‌డం లేదు. ఇలా.. మొత్తానికి కేసీఆర్ వ్యూహం ఏమ‌ర‌కు స‌క్సెస్అవుతుందో చూడాలి.