Begin typing your search above and press return to search.

ఇదే.. సీఎం కేసీఆర్ కొత్తిల్లు

By:  Tupaki Desk   |   3 Nov 2016 6:11 AM GMT
ఇదే.. సీఎం  కేసీఆర్ కొత్తిల్లు
X
భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏం చేసినా.. ఏం ఆలోచించినా భారీతనం మీదనే ఆయన మక్కువ చూపుతుంటారు. అంతేకాదు.. పాత వాటిని పెద్దగా ఇష్టపడని ఆయన.. కొత్తవాటి కోసం విపరీతమైన మోజును ప్రదర్శిస్తుంటారు. ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టే చందంగా ఉంటుంది కేసీఆర్ ఆలోచనలన్ని. ఇలా ఆయన్ను తప్పు పట్టకూడదేమో. ఎందుకంటే..కొత్త వాటిపై తనకున్న మోజుతో పాతవాటి పట్ల అలా వ్యవహరించటం తప్పేం కాదేమో.

సచివాలయం ముచ్చటే తీసుకోండి. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నప్పటికీ.. వెయ్యి మందితో ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం లేకపోవటం అనే అసంతృప్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొత్త సచివాలయం కట్టుకునేలా చేసింది. పేరుకు వసతి మాట మాట్లాడుతున్నా.. అసలు కారణం వాస్తు అన్న సంగతి అందరికి తెలిసిందే. టీవీ చర్చల్లో విపక్ష నేతలు వాస్తు మాటను ఎత్తితే కస్సున లేచే తెలంగాణ అధికారపక్షనేతలు.. లోగుట్టు సంభాషణల్లో కొత్త వాటి మీద పెట్టే ఖర్చు మీద ఒకింత అసంతృప్తినే ప్రదర్శిస్తుంటారు.

సచివాలయం మాదిరే.. సీఎం అధికార నివాసం ముచ్చట కూడా. బేగంపేటలో ఉన్న లంకంత ఇల్లు సైతం కేసీఆర్ కు నచ్చలేదు. అదేమంటే.. వసతుల లేమి. అసలు కారణం వాస్తు అయినా.. వసతులు లేమి ముచ్చట చెబితే చాలు కోర్టులు కూడా కాదనలేని పరిస్థితి. ఇక..భద్రతా కారణాలు చూపిస్తే ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరన్న విషయం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నివాసం ఆయనకు.. ఆయన ఫ్యామిలీకి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు లేని ఇబ్బందులన్నీ కేసీఆర్ కు మాత్రం చాలా ఇబ్బందిగా.. సౌకర్యవంతంగా లేనట్లుగా ఉండటం ఏమటన్నది ఎప్పటికీ అర్థంకాదు.

కొత్త వాటి మీద ఆయనకున్న మోజుకు తగ్గట్లే పంజాగుట్టకు దగ్గర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం పూర్తి అయిన ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. నిర్మాణం ఇంకా పూర్తి కాని ఈ భవనాన్ని నాలుగు నెలల క్రితం నిర్మాణం మొదలు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ కాంట్రాక్టు షాపూర్ జీ పల్లోంజీ సంస్థకు దక్కింది.

మొత్తం తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ముఖ్యమంత్రి నివాసంలో ఆయన ఉండే భవనం మాత్రం ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం మూడు భవనాల్ని నిర్మిస్తున్నారు. మిగిలిన ఎనిమిది ఎకరాల్లో300 కార్ల పార్కింగ్ కు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో రూ.33 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించాలని భావించినా.. ప్రస్తుతం రూ.50 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తలుచుకుంటే.. ఇలాంటి కొత్త భవనాలు ఒక లెక్కా ఏమిటి..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/