Begin typing your search above and press return to search.

మంత్రుల‌కు షాక్‌... ప్రోగ్రాంల‌లో పాల్గొన‌వ‌ద్ద‌ని కేసీఆర్ ఆర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   16 April 2019 7:13 AM GMT
మంత్రుల‌కు షాక్‌... ప్రోగ్రాంల‌లో పాల్గొన‌వ‌ద్ద‌ని కేసీఆర్ ఆర్డ‌ర్‌
X
తెలంగాణ‌లోని త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఊహించ‌ని ఆర్డ‌ర్ వేశారు. మంత్రులు అంటే ఉండే ప్ర‌త్యేక‌త, వారికి ద‌క్కే గౌర‌వం ఖ‌చ్చితంగా వేరుగా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, వారికి అలాంటి ప్ర‌త్యేక‌త‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌క్క‌ర్లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణభవన్‌ లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసినవారితో పాటుగా ముఖ్య నాయ‌కులకు కేసీఆర్ హిత‌బోధ చేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు జాగ్రత్తగా పనిచేయాలని కేసీఆర్ హెచ్చ‌రించారు. ``ఏం పనిచేస్తున్నాం? ఎలాంటి పనులు చేయాలి? అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మంత్రికాగానే చాలామంది వస్తుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లు పిలిచే అన్ని కార్యక్రమాలకు వెళ్లడం కాకుండా ఎంతవరకు అవసరమనేది పరిశీలించుకోవాలి.` అంటూ ప‌రోక్షంగా మంత్రులు హాజ‌ర‌య్యే ప్రోగ్రామ్‌ ల‌కు కేసీఆర్ క‌త్తెర వేసేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల‌కు సైతం కేసీఆర్ ఆర్డ‌ర్ వేసేశారు. `` ఎమ్మెల్యేలు ఈగోలు వదిలివేయాలి. పాత కొత్తల కలయికగా పార్టీ ఉండాలి. పాతవారిని గుర్తించాలి.`` అంటూ స్ప‌ష్టం చేశారు.

జాతీయ రాజ‌కీయాల‌పై గంపెడాశ‌లు పెట్టుకున్న కేసీఆర్ ఈ సంద‌ర్భంగా మ‌రోమారు వాటిని ప్ర‌స్తావించారు. `` కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో ఏన్డీయేకు 150 సీట్లకంటే ఎక్కువరావు. కేంద్రంలో మనం నిర్ణయాత్మకపాత్ర పోషించబోతున్నాం. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మరో 34 శాసనసభ స్థానాలు, పది ఎమ్మెల్సీ స్థానాలు పెరుగుతాయి. నాలుగైదు మంత్రి పదవులు కూడా పెరుగుతాయి. వీటితోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాస్థాయి చైర్మన్లు, డీసీఎంఎస్, ఓడీసీఎంఎస్ చైర్మన్.. ఇలా అనేక పదవులున్నాయి. వీటన్నింటినీ భర్తీచేసుకుందాం. అందరికీ అవకాశాలు కల్పిద్దాం. కొత్తవారు పాతవారు కలిసి పనిచేయండి. పార్టీలో కొత్తవారిని పాతవారు కలుపుకొని పనిచేయాలి. ఎవరినీ విస్మరించవద్దు. ఉద్యమం నాటి నుంచి ఉన్నవారందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి. `` అంటూ వెల్ల‌డించారు.