Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త పార్టీ.. దసరాకు విడుదల!

By:  Tupaki Desk   |   10 Sep 2022 4:22 AM GMT
కేసీఆర్ కొత్త పార్టీ.. దసరాకు విడుదల!
X
రాజకీయాల్లో సంచలనంగా మారారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అభిలాషను వ్యక్తం చేస్తున్న ఆయన.. తాజాగా అందుకు తాను సిద్దమైన విషయాన్ని వెల్లడించారు.కాకుంటే అధికారికంగా కాకున్నా.. తమ సొంత మీడియా సంస్థలో ప్రముఖంగా తమ జాతీయ పార్టీ గురించి.. జాతీయ రాజకీయాల మీద తనకున్న ఆసక్తిని.. తన ఆలోచనల్ని "పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం" పేరుతో ప్రజలకు తెలిసేలా చేశారు.

మరి.. కేసీఆర్ కొత్త పార్టీ ఎప్పుడు? అన్న ప్రశ్నకు సైతం టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజలకు అత్యంత పెద్ద పండుగ.. ముఖ్యమైన పర్వదినంగా భావించే దసరా రోజునే తన కొత్త పార్టీ వివరాల్ని కేసీఆర్ ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. జాతీయ పార్టీ పేరు.. పతాకం.. ఎజెండా తదితరాలపై ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి అయ్యిందని చెబుతున్నారు. పార్టీ అనౌన్స్ మెంట్ తోనే దేశ ప్రజల చూపు తమ పార్టీ మీద పడేలా ఆయన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు.. ముఖ్య నేతలు.. ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగావేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రకటన తర్వాత.. దాదాపు రెండు నెలల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్త్రత స్థాయిలో పర్యటిస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఉత్తనే షురూ చేయటం లేదని.. దాని వెనుక దాదాపు ఏడాదిన్నర మేథోమధనం.. కసరత్తు చేసిన తర్వాతే పార్టీని ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలంటూ శుక్రవారం తెలంగాణ భవన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఇదే తరహాలో టీఆర్ఎస్ శాసనసభా పక్షం.. పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు.

సోమ.. మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పాలి. అంతేకాదు.. జిల్లా.. మండల స్థాయిలోనూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి చేరాలని కోరుతూ తీర్మానాలు చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా యావత్ పార్టీ కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టమని కోరుతున్నందుకే ఆయన.. తన నిర్ణయాన్ని వెల్లడించేలా రాబోయే రోజుల్లో సీన్ ఉండేలా సిద్ధం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.