Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తాజా ప్లానింగ్ ఇదేనట!

By:  Tupaki Desk   |   22 Oct 2019 4:34 AM GMT
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తాజా ప్లానింగ్ ఇదేనట!
X
గడిచిన పదహారు రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. భయపెట్టినా.. బెదిరించినా సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగాఆర్టీసీ కార్మికులు వ్యవహరించటం తెలిసిందే. సెల్ఫ్ డిస్మిస్ లాంటి మాటలతో షాకిచ్చిన కేసీఆర్.. చర్చలకు సైతం నో అనేయటం తెలిసిందే.

ఈ మధ్యనే హైకోర్టు సైతం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్న మాటను చెప్పిన వేళలోనూ.. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో ఉన్న ఒక పాయింట్ ఆధారంగా చేసుకొని చర్చలు జరిపేందుకు సైతం సుముఖత వ్యక్తం చేయలేదు. దీని ద్వారా సమ్మె విషయంలో తానెంత సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని కేసీఆర్ సర్కారు చెప్పేసింది. ఇదిలా ఉంటే.. మరెన్ని రోజులు ఆర్టీసీ కార్మికుల సమ్మె సాగనుంది? అన్నది ప్రశ్నగా మారింది.

సరిగా బస్సులు నడవని కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. చివరకు సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపేందుకు సైతం సుముఖత వ్యక్తం చేయకుండా ఉండటం పలువురిని విస్మయానికి గురి చేసింది. కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొదట్నించి వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్.. తన మాటకు భిన్నంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేయటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తన మాటకు భిన్నంగా వ్యవహరించే వారి విషయంలో తానెంత కఠినంగా ఉండాలన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. సమ్మె విషయాన్ని పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెవిషయంలో తాను వ్యవహరించే ధోరణితో రానున్న రోజుల్లో మరే ఉద్యోగ సంస్థ సమ్మె చేయాలన్న ఆలోచన రాకూడదన్నట్లుగా గులాబీ బాస్ ప్లానింగ్ గా చెబుతున్నారు.

తక్కువ జీతాలతో చాలీచాలని బతుకులు బతికే ఆర్టీసీ కార్మికుల చేత ఎక్కువ కాలం సమ్మె చేయించటం ద్వారా వారిని ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతారు. ఇప్పటికే పని చేసిన నెలకు జీతం ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వం.. మరో నెల జీతం కూడా రాని పరిస్థితి. దీంతో.. నెలవారీగా కట్టాల్సిన కిస్తీలు.. కమిట్ మెంట్లు లాంటి వాటితో సమ్మె బండిని ఎక్కవ కాలం లాగరేన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.

సమ్మె విషయంలో తొలుత పట్టుదలగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచే కొద్దీ కార్మికులు నిరాశకు గురి కావటం.. తర్వాత భయాందోళనలకు గురై సమ్మె విరమించేలా వెనక్కి తగ్గుతారని.. ఆ టైం కోసమే కేసీఆర్ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సమ్మెను ఎంతకాలం సాగితే అంతకాలం సాగేలా చేయటం ద్వారా.. కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లోకి చిక్కుకుపోతే వారే దిగి వస్తారన్నదే ప్లానింగ్ అని.. అందుకే కామ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. కేసీఆర్ ప్లానింగ్ కు భిన్నంగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఏం చేయనున్నారన్నది ఒక ప్రశ్న అయితే.. జీతాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్న కార్మికుల్లో నిరాశ అలుముకోకుండా ఉండేందుకు ఏం చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.