Begin typing your search above and press return to search.

కొత్త సెక్రటేరియేట్ అటక ఎక్కినట్టే!!

By:  Tupaki Desk   |   12 Jan 2018 10:19 AM GMT
కొత్త సెక్రటేరియేట్ అటక ఎక్కినట్టే!!
X
తెలంగాణకు కొత్త సెక్రటేరియేట్ భవనాలు వచ్చేస్తున్నాయని.. ఆ సరికొత్త భవనాల నిర్మాణంలో తమ అధినేత కేసీఆర్ మార్క్ అంటే ఏమిటో కనిపిస్తుందని తెలంగాణ రాష్ట్రసమితి శ్రేణులు మొత్తం కొన్ని నెలల ముందు పండగ చేసుకున్నాయి. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత.. స్వయంగా గులాబీ బాస్ రంగంలోకి దిగి ఏకంగా ప్రధానితో కూడా ప్రత్యేకంగా భేటీ అయి.. సికింద్రాబాద్ లోని రక్షణశాఖకు చెందిన భూమిని సెక్రటేరియేట్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వానికి తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇలా తమ భూమిని రాష్ట్రానికి బదలాయించే విషయంలో నిర్ణయాలపై రక్షణశాఖ పునరాలోచనలో పడడంతో.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సెక్రటేరియేట్ అనే మాట ప్రస్తుతానికి అటకెక్కినట్టే అని అంతా అనుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియేట్ మీద.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. విసుర్లు వేస్తూనే ఉన్నారు. అసలు ఇదొక సెక్రటేరియేటా? సరిగ్గా కేబినెట్ మీటింగ్ పెట్టాలంటే.. సరైన హాల్ లేదు. అధికార్ల సమావేశం నిర్వహించాలంటే.. సరైన వసతి లేదు.. దీన్ని కూడా సెక్రటేరియేట్ అంటారా..? అంటూ ఆయన ఎద్దేవా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రం ఉండగా.. ప్రస్తుత సచివాలయంలోని సిబ్లాక్ ముఖ్యమంత్రికి కార్యస్థానంగా ఉండేది. చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు అక్కడినుంచే పాలించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫ్లోర్ మారారే తప్ప.. బ్లాక్ మారలేదు. అందరూ అక్కడినుంచే అన్ని పనులూ చేసినా.. కేసీఆర్ అసలు ఈ సచివాలయానికే రాకుండా ఇంటినుంచే సీఎం తాలూకు సమస్త పరిపాలన వ్యవహారాలను నడిపిస్తున్నారు.

కొత్త సెక్రటేరియేట్ కోసం తొలుత ఛాతీ ఆస్పత్రి స్థలాన్ని అనుకున్న కేసీఆర్ - తర్వాత రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్స్ పై కన్నేశారు. ప్రత్యామ్నాయంగా నగరానికి శివార్లలో రెట్టింపు భూమి ఇస్తాం అని కూడా చెప్పారు. అంతా ఓకే అయి.. ఇక స్థలం అప్పగింత సమయంలో తేడా వచ్చింది. మహారాష్ట్ర పశ్చిమబెంగాల్ లు కూడా తమకు వంద ఎకరాల వంతున రక్షణశాఖ భూములు లోకల్ గా రాష్ట్ర అవసరాలకు కావాలని అంటుడడంతో.. మొత్తం రాష్ట్రాలనుంచి వచ్చే ఇలాటి ప్రతిపాదనల్ని పక్కన పెట్టాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో.. తెలంగాణ కొత్త సెక్రటేరియేట్ అటకెక్కినట్టే అని పలువురు అనుకుంటున్నారు.