Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు ఇంకో స్కెచ్ తోడ‌యింది

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:25 AM GMT
కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు ఇంకో స్కెచ్ తోడ‌యింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ లెక్క‌లు వేరే ఉంటాయ‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాష్ట్రంలో అధికార టిఆరెస్ వర్సెస్‌ కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ఖాయమైంది. రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు వ్యూహాల‌కు ప‌దును పెడుతుంది అధికార టిఆరెస్ పార్టీ. గ‌డిచిన మూడున్నరేళ్లలో మూడు స‌ర్వేలు చేయించారు గులాబీ బాస్. సిట్టింగ్ ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది.. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో అధికార పార్టీకి బ‌ల‌మెంత పెరిగింది.. ప్లస్ లేంటి.. మైన‌స్ లేంటి .. ఇలా అన్ని విధాల లెక్కలు తేల్చారు కేసిఆర్. అదే క్రమంతో ప్రతి ప‌క్ష నాయ‌కుల బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌పై కూడా క‌న్నేశారు. దీంతో ప్రధాన ప్రతిప‌క్షంలో ముఖ్యనేత‌లే టార్గెట్ గా ఆపరేషన్‌ చేపట్టారు.

టీఆర్ ఎస్‌ లోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్రకారం కాంగ్రెస్ లోని ప‌ది మంది దిగ్గజాల‌పై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ దృష్టి పెట్టారు. ద‌క్షిణ తెలంగాణ‌లోని న‌ల్గొండ‌ - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్లు ఉండ‌టంతో ఈ రెండు జిల్లాల‌ను త‌మ గుప్పిట్లోకి లాక్కునేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం వాళ్ల‌ను క్షేత్ర‌స్థాయికే ప‌రిమితం చేసే స్కెచ్ వేశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నేత‌ జానారెడ్డి - పార్టీ సీనియ‌ర్ నేత‌లు జైపాల్ రెడ్డి - కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ - డికే ఆరుణ‌ - సునితా ల‌క్ష్మారెడ్డి - రేవంత్ రెడ్డి - సంప‌త్ ల‌తో పాటు ఖ‌మ్మం జిల్లాల్లో భ‌ట్టి విక్రమార్క‌ - నిజామాబాద్ జిల్లాలో గీతారెడ్డి - ష‌బ్బీర్ అలీ లాంటి సీనియ‌ర్లు, మాజీ మంత్రుల నియోజ‌క వ‌ర్గాల‌ను కీల‌కంగా టీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. గ‌త రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో చ‌రిష్మా ఉన్న నేత‌లు కావ‌డంతో వీళ్లందిరిని కేవ‌లం వాళ్ల నియోజ‌క వ‌ర్గాల‌కే ప‌రిమితం చేసేలా ప్లాన్ లు వేశార‌ని స‌మాచారం.

ఇందుకోంస ప్రచారంలో త‌మ నియోజ‌కవర్గం దాటి బ‌య‌టికి రాకుండా చేయ‌ల‌నే గులాబీ బాస్ వ్యూహమ‌ని అంటున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్లకు అండ‌గా ఉన్న జెడ్‌పీటీసీ - ఎంపీసీటీసీ - ద్వితీయ - తృతీయ శ్రేణి నేత‌ల‌ను త‌మ వైపునకు లాక్కునే ప్రయ‌త్నం చేస్తుంది. ఇప్పటికే ఆప‌రేష‌న్ కొడంగ‌ల్ పేరుతో రేవంత్ రెడ్డి నియోజ‌క వ‌ర్గంలోని నేత‌లంద‌రికి గులాబీ కండువా క‌ప్పింది. ఇలా టీఆర్ ఎస్‌ లోకి వ‌చ్చే సెకండ్ గ్రేడ్ నాయ‌కుల‌కు రానున్న రోజుల్లో ఏదో ఒక నామినేటెడ్ పోస్టును ఆశ చూప‌నుండ‌టంతో న‌ల్గొండ‌ - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ - నిజామాబాద్ - ఖమ్మం జిల్లాల నుంచి భారీగా వ‌ల‌స‌లు పెరుగుతాయ‌ని టీఆర్ ఎస్ నేత‌లు బావిస్తున్నారు. కాంగ్రెస్ బ‌లంగా ఉన్న 20నియోజ‌క వ‌ర్గాల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను మొద‌లు పెట్టాల‌ని భావిస్తుంది. సీనియ‌ర్లకు అండ‌గా ఉన్న నేత‌లంతా టీఆర్ ఎస్‌ లోకి వ‌స్తే .. ఇక కాంగ్రెస్ దిగ్గజాలు ఆత్మరక్షణలో పడి.. వ్యక్తిగతంగా తమ విజయం కోసం త‌ల‌మున‌క‌లై జిల్లా దాటిరారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లో వారి ప్రభావం లేకుండా జాగ్రత్త పడవచ్చన్నది గులాబీ బాస్‌ వ్యూహమ‌ని అంటున్నారు. ఎన్నిక‌లకు ఏడాదిన్నర ఉండ‌గానే గెలుపు బాట‌లు వెతుకుంటున్న క్ర‌మంలోనే ఈ ఫార్ములాను తెర‌మీద‌కు తెచ్చార‌ని విశ్లేషిస్తున్నారు.