Begin typing your search above and press return to search.

ఈ ‘‘న్యూఇయర్’’ వాయింపేంటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:56 AM GMT
ఈ ‘‘న్యూఇయర్’’ వాయింపేంటి కేసీఆర్?
X
నలుగురితో కలిసి సరదాగా గడపటం కూడా విలాసవంతం కానుంది. చిన్న చిన్న పార్టీలకు సైతం పన్నుపోటు తప్పనిసరి అవుతోంది. సంక్షేమం గురించి నిత్యం మాటలు చెప్పే ప్రభుత్వాలు.. ఏ చిన్న అవకాశం వచ్చినా విలాసపన్ను.. సేవా పన్ను.. ఆ పన్ను.. ఈ పన్ను అంటూ తాట తీస్తోంది. ఒక బేకరిలో కేకు ముక్క కొంటే దాదాపు 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. బిర్యానీ సంగతి అంతే. ఓ మోస్తరు హోటల్లో భోజనం చేస్తే.. హోటలోడు ఇచ్చే వంద బిల్లులో 20 రూపాయిలు పన్నుకే పోయే పరిస్థితి.

ఇలా.. పన్ను.. పన్ను అంటూ జేబుల్ని ప్రభుత్వాలు ఖాళీ చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు న్యూఇయర్ పార్టీల మీద భారీగా పన్నుపోటు వేసింది. కొత్త సంవత్సరాన్ని నలుగురితో కలిసి సరదాగా గడపాలన్న దానికి పన్నుభారం తప్పదంతే. న్యూఇయర్ సందర్భంగా నిర్వహించే పార్టీలకు సంబంధించి 20 శాతం పన్ను చెల్లించాలని నిర్వాహకుల్ని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.

మరి.. ప్రభుత్వానికే 20 శాతం పన్ను చెల్లిస్తున్నప్పుడు.. న్యూఇయర్ పార్టీ రేట్లు పెరగకుండా ఉంటాయా? పార్టీ ఏర్పాటు చేసి జనాలకు కాస్తంత వినోదాన్ని పంచాలనుకునే సంస్థలు.. న్యూఇయర్ వేడుకల్ని కేవలం లాభాలు కొల్లగొట్టే సంస్థల తీరుకు ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వం కూడా 20శాతం వినోదపన్ను పేరుతో వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

పన్ను ఎగగొట్టకుండా ఉండేందుకు వీలుగా.. వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని సరదాగా గడపాలని భావించే వారి మీద భారం వేయకుండా.. వీలైతే.. ఈ వేడుకులకు సంబంధించిన ధరలు భారీగా పెంచకుండా నియంత్రించేలా చర్యలు తీసుకుంటే పన్నుపోటుతో నలిగిపోయే సగటు జీవికి కాస్త ఉపశమనంగా ఉండేది. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి జీవుల సౌకర్యాలు.. వసతుల గురించి పట్టించుకోని సర్కార్లు.. ఇలాంటి పన్నుపోట్టు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాయని భావించటం అత్యాశే అవుతుందేమో.