Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త థియరీ సెల్ఫ్ డిస్మిస్

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:29 AM GMT
కేసీఆర్ కొత్త థియరీ సెల్ఫ్ డిస్మిస్
X
సమ్మె చేయటం ఏమిటి? మేం ఊరుకోం. విధుల్లోకి రావాలి. ఫలానా రోజు సాయంత్రం లోపు ఉద్యోగాల్లో చేరండి. పని చేయండి. గడువు తీరిన తర్వాత.. ఉద్యోగాలు ఊడిపోతాయ్.. అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారనుకుందాం. అందుకు ప్రతిగా ఉద్యోగ సంఘాలు స్పందించి.. సరే.. డిస్మిస్ చేస్తున్నట్లు ఆర్డర్లు పంపాలని కోరితే.. సహజంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారి స్పందన ఎలా ఉంటుంది?

మిగిలిన ముఖ్యమంత్రుల స్పందన ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మాత్రం భిన్నంగా ఉందని చెప్పాలి. తాజాగా ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. ఉద్యోగుల్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదని.. వారంతా సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ విచిత్రమైన థియరీని వినిపించి సంచలనంగా మారారు.

సంఘాలు సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామనటం కామెడీగా కొట్టి పారేశారు. ప్రభుత్వం దగ్గరున్న లెక్కల ప్రకారం ఆర్టీసీ యాజమాన్యంలో ఇప్పుడు కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారని.. మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే.. వారంతా గడువు లోపు విధుల్లో చేరకపోవటంతో వారంతట వారు తొలిగిసోయినట్లే (సెల్ఫ్ డిస్మిస్) అన్న థియరీని వినిపించారు.

ప్రభుత్వం.. ఆర్టీసీ యాజమాన్యం చేసిన వినతికి స్పందించలేదని.. తమకు తాముగా తొలిగిపోయిన ఆర్టీసీ ఉద్యోగులు డిపోల వద్దకు కానీ.. బస్ స్టేషన్ల దగ్గరకు కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బలగాల్ని ఏర్పాటు చేయాలని డీజీపీని తాము ఆదేశించినట్లుగా కేసీఆర్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎలాంటి పత్రాలు బయటకు రావటం లేదు. సీఎంవో నుంచి మీడియా సంస్థలకు వచ్చే ప్రెస్ నోట్లు మినహాయించి.. మరే పత్రం లేకుండా 48 వేల మందికి పైగా ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా ప్రకటిస్తూ.. కేసీఆర్ కొత్త సంచలనానికి తెర తీశారని చెప్పక తప్పదు. కేసీఆర్ తీసుకొచ్చిన సరికొత్త థియరీతో.. రేపొద్దున ఎవరూ సమ్మె చేయటానికి వీల్లేని రీతిలో ఉందని చెప్పక తప్పదు. మరి.. దీనిపై కార్మిక సంఘాలు.. కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.