Begin typing your search above and press return to search.

మూడోసారి మారిన కేసీఆర్ వాహనాలు

By:  Tupaki Desk   |   6 Aug 2015 4:44 AM GMT
మూడోసారి మారిన కేసీఆర్ వాహనాలు
X
కేవలం పద్నాలుగు నెలల కాలంలో.. తన కాన్వాయ్ లోని వాహనాల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి మార్చేశారు. ఎంతైనా ధనిక రాష్ట్రం ముఖ్యమంత్రి అయినప్పుడు.. అసౌకర్యంగా ఉండే వాహనాల్లో ఆయన పర్యటించలేరు కదా.

తాజాగా కేసీఆర్ కాన్వాయ్ లోకి వచ్చిన వాహనాలన్నీ బుల్లెట్ ఫ్రూప్ కావటం విశేషం. అంతేకాదు.. తాజా వాహన శ్రేణితో అత్యంత ఖరీదైన వాహనాల్ని తన కాన్వాయ్ గా మార్చుకున్నట్లు అయ్యింది. ఒక్కొక్కటి రూ.1.30కోట్ల విలువైన ఐదు ల్యాండ్ క్రూయిజర్ ప్రోడోలను తాజాగా సిద్ధం చేశారు. తొలుత వీటిని కొనుగోలు చేసి.. అనంతరం బుల్లెట్ ఫ్రూప్ వాహనాలుగా మార్పులు చేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కేసీఆర్ కాన్వాయ్ లో నలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్లు ఉండేవి. నల్ల రంగు కావటమో మరేమో కానీ.. కొద్ది రోజుల్లో వాటిస్థానంలో తెల్ల రంగు ఫార్చ్యూనర్లు వచ్చేశాయి. ఇలా జరిగి గట్టిగా ఏడాది కూడా కాలేదు కానీ కొత్తగా మరో వాహన శ్రేణి వచ్చేసింది.

యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. బుధవారం నుంచి వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే రూ.5కోట్ల ఖర్చుతో అత్యంత ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ బస్సును.. జిల్లాల పర్యటనల కోసం వినియోగిస్తుండటం తెలిసిందే. తాజాగా రూ.6.50కోట్లతో కొత్త వాహన శ్రేణిని కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పక్కనున్న ఏపీ ముఖ్యమంత్రి టాటా సఫారీలు వాడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఖరీదైన ట్యాండ్ క్రూయిజర్లను వినియోగిస్తున్నారు.