Begin typing your search above and press return to search.

కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. దేశ వ్యాప్త టూర్ కు ప్లానింగ్

By:  Tupaki Desk   |   20 May 2022 3:28 AM GMT
కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. దేశ వ్యాప్త టూర్ కు ప్లానింగ్
X
అనూహ్య నిర్ణయాల్ని ప్రకటించటం ద్వారా అందరిని అవాక్కుఅయ్యేలా చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తనదైన మార్కును ప్రదర్శించారు. గడిచిన కొద్ది రోజుల్లో అత్యధిక కాలాన్ని ఫాం హౌస్ అలియాస్ ఫార్మర్ హౌస్ లోక గడిపిన గులాబీ బాస్.. రెండు, మూడు రోజుల క్రితమే ప్రగతిభవన్ కు రావటం.. వచ్చిన వెంటనే దేశ వ్యాప్త టూర్ ను ప్రకటించటం.. ఈ రోజు (శుక్రవారం) నుంచి ఎనిమిది రోజుల పాటు ఆయన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటారని చెబుతున్నారు.

మోడీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేయటం.. అందులో కొంత మేర సక్సెస్ అయినప్పటికీ.. పలువురు నేతలు కేసీఆర్ తో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించటం లేదంటున్నారు. అందుకే.. మిగిలిన వారితో చేతులు కలపటానికి ముందు.. జాతీయస్థాయిలో పర్యటనలు చేయటం ద్వారా.. కొత్త సమీకరణాలకుతెర తీయాలన్నది కేసీఆర్ ప్లానింగ్ అని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆయన దేశంలోనే అత్యధికులు ఆధారపడే వ్యవసాయానికి ఆదరవుగా నిలిచే రైతన్నలకు సాయం చేయటం.. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను పరామర్శించటంతో పాటు.. ఆర్థికంగా వారికి దన్నుగా నిలిచేలా భారీ ఆర్థిక సాయాన్ని అందించేలా ప్లాన్ చేయటం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్.. దేశ రాజధానిలోపలువురు రాజకీయ పార్టీల నేతలు.. ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు.

జాతీయ మీడియా సంస్థలతోనూ.. ప్రముఖులతోనూ సమావేశాల్ని నిర్వహించను్న ఆయన.. 22న చండీగఢ్ కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో కన్నుమూసిన పంజాబ్.. హరియాణా. .ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది కుటుంబాలను పరామర్శించి.. వారిలో ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. దీంతో.. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మారుమోగి పోవడంతో పాటు.. కేంద్రం చేయాల్సిన పనిని.. తమకు ఏ మాత్రం సంబంధం లేని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాయం చేయటం మాత్రం అందరిలో రిజిస్టర్ కావటం ఖాయమంటున్నారు.

తాజా పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లతో పాటు.. కర్ణాటకలో మాజీ ప్రధానమంత్రి దేవగౌడ.. ఆయన కుమారుడు కమ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిలతో భేటీ కానున్నారు. మే 27న రాలేగావ్ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి శిరిడీ వెళ్లి సాయి బాబాను దర్శనం చేసుకోనున్నారు. మే 29 లేదంటే 30న పశ్చిమ బెంగాల్.. బీహార్ రాష్ట్రాలకు వెళ్లి గతంలో తాము ప్రకటించిన పరిహారాన్ని స్వయంగా అందించనున్నారు. మొత్తంగా దేశ రాజకీయాల్లో తన ముద్రను వేయాలని భావిస్తున్న కేసీఆర్ భారీ ప్లానింగ్ తోనే తాజా టూర్ చేపట్టినట్లుగా చెప్పక తప్పదు.