Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా?:సింపుల్ గా డుమ్మా కొట్టేశారే!

By:  Tupaki Desk   |   5 Nov 2015 12:49 PM GMT
గ‌మ‌నించారా?:సింపుల్ గా డుమ్మా కొట్టేశారే!
X
ఏపీ ముఖ్య‌మంత్రి కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కానీ విదేశాల‌కు వెళ‌తారు.. ఎందుకు? విదేశీ పెట్టుబ‌డిదారుల్ని ఆక‌ర్షించేందుకు.. వారితో భేటీ అయి నాలుగు కంపెనీల్ని రాష్ట్రాల‌కు తీసుకొచ్చేందుకు. మ‌రి.. విదేశాల‌కు వెళ్లి మ‌రీ.. పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ అయి.. వారిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుండే ముఖ్య‌మంత్రులు.. అలాంటి పారిశ్రామిక‌వేత్త‌లే రాష్ట్రానికి వ‌స్తే?

రెడ్ కార్పెట్ ప‌రిచి.. పెద్ద బొకే ఇచ్చి.. వారిని సాద‌రంగా ఆహ్వానిస్తే..వారెలా స్పందిస్తారు? ఈ మాత్రం దానికే పెట్టుబ‌డులు పెట్టేస్తార‌ని చెప్ప‌లేం కానీ.. రాష్ట్రం ప‌ట్ల కాస్తంత సానుకూల ధోర‌ణి క‌ల‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. పేరు ప్ర‌ఖ్యాతులున్న పారిశ్రామిక‌వేత్త‌లు రాష్ట్రానికి వ‌స్తుంటే.. వారి కోసం వెయిట్ చేయ‌టం లేదంటే.. వారికి అనుకూలంగా షెడ్యూల్ లో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవ‌టం త‌ప్పేం కాదు. ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల్ని క‌లిసేందుకు విదేశాల‌కు వెళ్లే ముఖ్య‌మంత్రులు.. వారున్న రాష్ట్రానికే వ‌స్తే సాద‌రంగా ఆహ్వానించ‌లేరా? కాస్త స‌మ‌యాన్ని స‌ర్దుబాటు చేసుకోలేరా? క‌చ్ఛితంగా చేసుకుంటార‌నే చెబుతారు.

కానీ.. మిగిలిన ముఖ్య‌మంత్రుల‌కు భిన్నం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్న విష‌యం తాజాగా మ‌రోసారి నిరూపిత‌మైంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన టీ హ‌బ్‌ ను ఈ రోజు ఘ‌నంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి గ‌త మూడు రోజులుగా మీడియాలో భారీగా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రింత గొప్ప‌గా ప్ర‌చారం చేస్తున్న కార్య‌క్ర‌మానికి భార‌త‌దేశంలో పారిశ్రామిక రంగంలో ఐకాన్ లాంటి ర‌త‌న్ టాటా వ‌చ్చారు. మ‌రి.. అలాంటి పారిశ్రామిక‌వేత్త వ‌స్తున్న కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి హాజ‌రు కాకుండా ఉంటారా? మామూలుగా అయితే వ‌చ్చేస్తారు. కానీ.. కేసీఆర్ అంద‌రి లాంటి సీఎం కాదు క‌దా.

ఇక‌.. టీ హ‌బ్ ప్రాజెక్ట్ ఏమైనా చిన్న‌దా అంటే అదీ కాదు. ప్ర‌పంచ స్టార్టప్స్ ను ఆక‌ర్షించాల‌న్న భారీ ప్ర‌య‌త్నంతో దీన్ని రూపొందించారు. దాదాపు 70వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఉన్న ఈ టెక్నో హ‌బ్ అత్యుత్త‌మ ఇంక్యుబేట‌ర్ గా అభివ‌ర్ణిస్తున్నారు. రూ.40కోట్ల వ్య‌యంతో నిర్మించిన టీ హ‌బ్ ను ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేశారు. దాదాపు 800 మంది ఔత్సాహికుల‌కు అవ‌కాశం క‌ల్పించ‌నుంది. దాదాపు 200కు పైగా స్టార్ట‌ప్స్ వ‌చ్చే వీలుంది. ప్ర‌పంచ స్థాయి స్టార్టప్స్ ను ఆక‌ర్షించాల‌న్న భారీ ల‌క్ష్యం ఉన్న కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి గైర్హాజ‌రు కావ‌టం గ‌మ‌నార్హం.

ఇంతా చేస్తే కేసీఆర్ ఏమైనా బిజీగా ఉన్నారా? అంటే.. ఆయ‌న ఆదివారం నుంచి త‌న ఫాంహౌస్ లో ఉన్నారు. ఓప‌క్క హైద‌రాబాద్ లో అంత పెద్ద కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటే.. మ‌రి తెలంగాణ ముఖ్య‌మంత్రి ఫాంహౌస్ లో ఏం చేస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు. ఓప‌క్క పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు ముఖ్య‌మంత్రులు కిందామీదా ప‌డుతుంటే.. మ‌రోవైపు కేసీఆర్ అందుకు భిన్నంగా ర‌త‌న్ టాటా లాంటి పెద్ద పారిశ్రామిక‌వేత్త వ‌స్తే రాక‌పోవ‌టం ఏమిటి? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అయితే.. కొడుకు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి కొడుకును ఫోక‌స్ చేసేందుకే డుమ్మా కొట్టారా? అన్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఇంత‌కీ.. కేసీఆర్ హాజ‌రు ఎందుకు కాన‌ట్లు..?