Begin typing your search above and press return to search.

కాళేశ్వ‌రంలో హ‌రీశ్ కు క్రెడిట్ ఇవ్వ‌వా సారూ?

By:  Tupaki Desk   |   16 Jun 2019 5:02 AM GMT
కాళేశ్వ‌రంలో హ‌రీశ్ కు క్రెడిట్ ఇవ్వ‌వా సారూ?
X
ఒక భారీ ప్రాజెక్టును నిర్మించ‌టం.. అందునా టైమ్ లైన్ పెట్టుకొని ప‌నులు ప‌రుగులు పెట్టించ‌టం అంత మామూలు విష‌యం కాదు. ప‌ని ఏదైనా స‌రే.. అప్ప‌గించ‌టం త‌రువాయి ట్ర‌బుల్ షూట‌ర్ మాదిరి దూసుకెళ్లే హ‌రీశ్ రావు టాలెంట్ తెలిసిందే. అలాంటి ఆయ‌న్ను మ‌డ‌త‌పెట్టి ప‌క్క‌న పెట్టేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై హ‌రీశ్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

త‌న క‌ల‌ల ప్రాజెక్టుగా అభివ‌ర్ణిస్తూ.. మ‌రికొద్ది రోజుల్లో గ్రాండ్ గా స్టార్ట్ చేయ‌నున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొత్తం తానే అయిన‌ట్లు క‌ట్టించిన‌ట్లుగా కేసీఆర్ బిల్డ‌ప్ ఇవ్వ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. క‌ష్టం ఒక‌రిదైతే.. ఫ‌లితం మ‌రొక‌రు త‌మ ఖాతాలో వేసుకుంటారా? అంటూ సారు తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఈ రోజున ఇలా ఉందంటే దానికి కార‌ణం హ‌రీశ్ రావే. ఆయ‌న రెక్క‌ల క‌ష్టంగా ప్రాజెక్టును చెప్పాలి. ప‌గ‌లు.. రాత్రి అన్న తేడా లేకుండా 24 గంట‌లూ ప‌ని చేసేలా ప్లాన్ చేసి.. ఇంజినీర్ల‌ను.. కాంట్రాక్ట‌ర్ల‌ను.. ప‌ని వాళ్ల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించిన హ‌రీశ్‌.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును అనుకున్న‌ట్లుగా పూర్తిచేశారు. ప‌ని చివ‌ర్లో ఉన్న వేళ‌.. అక‌స్మాత్తుగా ఆయ‌న పోర్ట్ ఫోలియోను లాగేసుకున్న కేసీఆర్‌.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తానే చూసుకుంటున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న ఆగ్ర‌హం ఇప్ప‌టికే ఆయ‌న అభిమానులు భారీగా ఉంది. ఇది స‌రిపోద‌న్న‌ట్లు కాళేశ్వ‌రం ప్రాజెక్టు రెక్క‌ల క‌ష్టాన్ని హ‌రీశ్ కు చెంద‌కుండా చేసి.. మొత్తం క్రెడిట్ సారు తీసుకోవ‌టాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌రీశ్ ప‌క్షాన గ‌ళం విప్పుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క్రెడిట్ లో సింహ‌భాగంగా హ‌రీశ్ కే చెందుతుంద‌ని.. అందుకు భిన్నంగా ప్రాజెక్టు మొత్తాన్ని తానే న‌డిపించిన‌ట్లుగా కేసీఆర్ చెప్పుకోవ‌టం త‌ప్ప‌న్న మాట ప‌లువురు నోట వినిపిస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఫ‌లాన్ని మొత్తంగా త‌న సొంతం చేసుకున్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ మూల్యం చెల్లించాల్సి వ‌స్తోంద‌న్న మాట కొంద‌రు నేత‌ల ప్రైవేటు మాట‌ల్లో వినిపించ‌టం చూస్తే.. కేసీఆర్ కాసింత అలెర్ట్ అవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.