Begin typing your search above and press return to search.

మోడీకి న‌చ్చ‌నిదేదీ కేసీఆర్ కు ఆస‌క్తి ఉండ‌దా?

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:45 AM GMT
మోడీకి న‌చ్చ‌నిదేదీ కేసీఆర్ కు ఆస‌క్తి ఉండ‌దా?
X
రాజ‌కీయ నేత‌ల మాట‌ల‌కు చేత‌ల‌కు ఏ మాత్రం సంబంధం ఉండ‌ద‌న్న విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా మాట‌లు చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స‌మ‌యంలో త‌మ పార్టీలోకి వ‌చ్చే ఇత‌ర పార్టీ నేత‌ల‌కు ఎలాంటి హామీలు ఇచ్చారో బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ సీట్లు పెర‌గ‌టం ఖాయ‌మ‌ని.. ఆ స‌ర్దుబాటుతో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటూ వ‌చ్చిన విష‌యం అంద‌రికి తెలిసిందే.

అంత దాకా ఎందుకు నిన్న మొన్న‌టి వ‌ర‌కూ పెరిగే అసెంబ్లీ సీట్ల ముచ్చ‌ట మీద తెలంగాణ అధికార ప‌క్షం ఎన్ని లెక్క‌లు వేసుకుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

కానీ.. తాజాగా మాత్రం కేసీఆర్ త‌న మాట‌ను పూర్తిగా మార్చేశారు. అసెంబ్లీ సీట్ల పెంప‌కం మీద త‌మ‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని తేల్చి చెబుతున్నారు. ఒక‌వేళ‌.. నిజంగానే అసెంబ్లీ సీట్ల పెంప‌కం మీద ఆస‌క్తే లేన‌ప్పుడు.. మొన్న‌టి వ‌ర‌కూ అంత‌గా ఎందుకు ట్రై చేసిన‌ట్లు?

సీట్ల పెంప‌కం మీద మోడీకి ఏ మాత్రం ఇష్టం లేని విష‌యం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అసెంబ్లీ సీట్ల కార‌ణంగా బీజేపీ వ‌చ్చే లాభం ఏమీ లేన‌ప్పుడు సీట్ల‌ను పెంచితే వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమిట‌న్న ఆలోచ‌న‌తోనే మోడీ ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్లుగా చెబుతారు. ఆ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. సీట్ల పెంపు లేద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే.. సీట్ల పెంపుపై త‌మ‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని.. పెరిగితే ఓకే.. పెర‌గ‌కుండా కూడా ఓకేనంటూ తేల్చేస్తున్నార‌ని చెప్పాలి. ఇదే స‌మ‌యంలో ఇదే అంశం మీద ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం.. సీట్ల పెంప‌కంపై ప్ర‌ధాని మోడీతో మాట్లాడ‌తాన‌ని చెబుతుండ‌టం క‌నిపిస్తుంది. జ‌ర‌గ‌ని విష‌యాల మీద అదే ప‌నిగా మాట్లాడితే జ‌రిగే న‌ష్టం మీద కేసీఆర్ కు ఉన్న అవ‌గాహ‌న‌తోనే ఆయ‌నీ విష‌యాన్ని వ‌దిలేసిన‌ట్లుగా చెప్పాలి. ఏమైనా.. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ లో ఒక స్ప‌ష్ట‌మైన మార్పు అయితే క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. మోడీకి న‌చ్చింది ఆయ‌న‌కు న‌చ్చ‌టం.. మోడీకి న‌చ్చ‌ని అంశంపై కేసీఆర్‌కు ఆస‌క్తి త‌గ్గిపోతుండ‌టం స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.