Begin typing your search above and press return to search.

కొత్త మోజు ఓకే..10వేల కోట్ల ఖర్చు పెట్టరేం?

By:  Tupaki Desk   |   20 Oct 2016 4:16 AM GMT
కొత్త మోజు ఓకే..10వేల కోట్ల ఖర్చు పెట్టరేం?
X
కొత్త కొత్త కలలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కొన్ని విషయాల్లో మహా చిత్రంగా ఉంటుంది. వాస్తు బాగోలేదని..సౌకర్యవంతంగా లేదంటూ ఎడాపెడా కొత్త కొత్తగా భారీ భవనాలు నిర్మించేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆయన.. బంగారు కోడిగుడ్లు పెట్టే భారీ ప్రాజెక్టు విషయంలో మాత్రం చాలా లైట్ గా వ్యవహరిస్తారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును షురూ చేసే విషయంలో అంతులేని ఆలస్యాన్ని ప్రదర్శించే ఆయన.. కొత్త సీఎం నివాస గృహాన్ని యుద్ధప్రాతిపదికన కట్టించేస్తారు. ఉండే ఇల్లు కాబట్టి ఆ మాత్రం స్పీడ్ ఉండటంలో తప్పు లేదు. పెద్దగా అవసరం లేకున్నా.. ఇప్పుడున్న సచివాలయాన్ని నేలమట్టం చేసేసి.. భారీ భవనాలు కట్టించేయాలన్న కొత్త తరహా ఆలోచనలు చేసే ఆయన.. భాగ్యనగరి ముఖచిత్రాన్ని మొత్తంగా మార్చేసే భారీ ప్రాజెక్టు విషయంలో ప్రదర్శించే నిర్లక్ష్యం విస్మయాన్ని రేకెత్తించక మానదు.

ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ సర్కారు ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు గడిచిన రెండేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. రూపాయి కూడా ఖర్చుచేయని నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యూపీఏ హయాంలో చెప్పినట్లు కాకుండా.. ఈ ప్రాజెక్టుకు కొన్నిమార్పులు చేర్పులు చేసి మోడీ సర్కారుకు కేసీఆర్ సర్కారు తీరు తోడు కావటంతో ఈ మెగా ప్రాజెక్టు అటకెక్కినట్లేనన్న మాట వినిపిస్తోంది.

2013లో మా గొప్పగా చెప్పేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ చెప్పిన కలలు అన్నిఇన్ని కావు. విశ్వనగరంగా హైదరాబాద్ మారే ఛాన్స్ ఉన్న ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు తాజాగా కనిపిస్తోంది. రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రవాహం.. దాదాపు 25 లక్షల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు కానీ పూర్తి అయితే.. గ్లోబల్ స్థాయిలో హైదరాబాద్ ఒక వెలుగు వెలిగిపోతుందని ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సిఉంది. మొదటి దశలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం రూ.10వేల కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. ఇక.. కేంద్రం తన వాటా కిందరూ.3వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.

రాష్ట్రాలకు పైసలు విదిల్చే విషయంలో మహా కరకుగా వ్యవహరించే మోడీ సర్కారు.. ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద తాము ఇవ్వాల్సిన రూ.3వేల కోట్లకు ముప్పుతిప్పలు పెట్టే పరిస్థితి. దీనికి తగ్గట్లే కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వైఖరితో ప్రాజెక్టు మొత్తంగా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిత్యం సంపన్న రాష్ట్రమని తెగ కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి గడిచిన రెండేళ్లలో ఒక్కపైసా కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగే నాథుడే కనిపించడు. ఒకవేళ కేంద్రం తాను ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదనే అనుకుందాం. ముందు అయితే.. రాష్ట్ర సర్కారు తన వరకు తాను చేయాల్సిన పనుల్ని చేసేసి.. కేంద్ర నిర్లక్ష్యాన్ని సరైన రీతిలో తెర మీదకు తెస్తే.. మోడీ సర్కారు మాట వినకుండా ఉండదని చెప్పలేం.

కొత్త కొత్త భవనాల కోసం వందల కోట్లు కుమ్మరించే కేసీఆర్ సర్కారు..భాగ్యనగరి రూపురేఖలను మొత్తంగా మార్చే సత్తా ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు టేకప్ చేయలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పని పరిస్థితి. లక్షల కోట్ల రూపాయిలపెట్టుబడులు.. లక్షలాది మందికి ఉపాధి సౌకర్యాలు కల్పించే ఒక మెగా ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు కలలు కనటం లేదు. ప్రతి విషయానికి ఐదేళ్లు.. పదేళ్ల విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయమని చెప్పే ముఖ్యమంత్రి.. ఒక కీలక ప్రాజెక్టు విషయంలో రెండేళ్లలో పైసా ఎందుకు విదల్చనట్లు? కొత్త కలల మీద ఉండే ఆసక్తి.. పాత పనుల మీద ఎందుకు ఉండదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/