Begin typing your search above and press return to search.

క‌న్న‌డ ర‌చ్చ‌పై ఏదీ తేల్చుకోలేక‌పోతున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   21 May 2018 4:45 AM GMT
క‌న్న‌డ ర‌చ్చ‌పై ఏదీ తేల్చుకోలేక‌పోతున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డైలామాలో ప‌డిపోయారు. ఎలాంటి సంక్లిష్ట స్థితిలో అయినా త‌న గ‌ళం వినిపించే కేసీఆర్ ప్ర‌స్తుతం సైలెంట్ అయిపోయారు. రాజ‌కీయంగా చాణ‌క్యుడు అనే పేరున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప‌రిణామాల‌పై కిమ్మ‌న‌కుండా ఉంటున్నారు. పైగా అదే స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీ వేదిక‌గా సాగే రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం గురించి క‌ల‌లు కంటుండ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా క‌ర్ణాట‌క ప‌రిణామాల గురించి. కేసీఆర్ మ‌ద్ద‌తు ఇచ్చిన జేడీఎస్‌ సీఎం పీఠం కైవ‌సం చేసుకోవ‌డం గురించి.

అనేక ఉత్కంఠ‌లు, ఎంతో స‌స్పెన్స్ సృష్టించిన రాజ‌కీయాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు క‌న్న‌డ రాజ‌కీయం ఓ కొలిక్కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, గడువు కంటే ముందుగానే ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షలో నెగ్గేందుకు చివరి వరకు బీజేపీ సామభేద దండోపాయాలు ప్రయోగించినా, క‌మ‌ళ‌నాథులు అనుసరించిన పద్ధతిని తప్పుపడుతూ ఆయా పార్టీల నేతలు ఖండించినా సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు ఈ విషయంలో బహిరంగంగా ప్రకటన విడుదల చేయలేదు! అదే స‌మ‌యంలో ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన జేడీఎస్ సీఎం కుర్చీని అధిరోహిస్తోంది. దానిపై కూడా కేసీఆర్ స్పందించ‌లేదు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని, అందుకే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన కేసీఆర్‌ శనివారం నాటి పరిణామాలను స్వాగతించకపోవడంలో పరమార్థమేంటో అర్థం కావడం లేదని చ‌ర్చ జ‌రుగుతోంది.

క‌న్న‌డ ఎన్నిక‌ల‌పై కేసీఆర్ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌కు ముందే, ఫెడరల్‌ఫ్రంట్‌లో భాగంగా కర్ణాటకకు వెళ్లి దేవెగౌడనూ - కుమారస్వామితోనూ చర్చలు జరిపి, ఎన్నికల్లో జేడీఎస్‌ కు మద్దతు ప్రకటించారు. అవసరమైతే జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. ఇది జరిగిన అనంత‌రం అనేక పరిణామాలతో ఆయన మద్దతిచ్చిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నా కేసీఆర్‌ కుమారస్వామికి అభినందనలు చెప్పకపోవడం గమనార్హం. అదే స‌మ‌యంలో ఆయ‌న ఫ్రంట్‌లో మ‌రో కీల‌క నాయ‌కురాలు అయిన మమతా బెనర్జీ జేడీఎస్ నాయ‌కుడు కుమారస్వామికి అభినందనలు తెలియజేశారు. ఇదే స‌మ‌యంలో బీజేపీపై మండిపడ్డారు. మ‌రోవైపు చంద్ర‌బాబు సైతం స్పందించి బీజేపీ తీరును త‌ప్పుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మౌనం చ‌ర్చ‌నీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించడానికి కేసీఆర్‌ భయపడుతున్నారా? కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కుమారస్వామికి అభినందనలు చెప్పలేదా? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ఉద్భ‌విస్తున్నాయి. దీనిపై టీఆర్ ఎస్ నేత‌లు స్పందిస్తూ ప్రమాణస్వీకారం రోజు బెంగళూరు వెళ్లడమా - ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బలపరీక్ష పూర్తయిన తర్వాత అభినందనలు చెప్పడమో ఏదో ఒకటి చేస్తారని పేర్కొంటున్నారు.