Begin typing your search above and press return to search.

స‌వాల్ విసిరి సైలెంట్ అయితే ఎట్లా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   26 Jun 2018 5:02 AM GMT
స‌వాల్ విసిరి సైలెంట్ అయితే ఎట్లా కేసీఆర్‌?
X
తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ జ‌రిపిన ఉద్య‌మం గుర్తుందా? ఉద్య‌మ వేళ‌లో ఎవ‌రైనా ప్ర‌ముఖుడు స‌వాలు విస‌ర‌టం ఆల‌స్యం.. యుద్ధ ప్రాతిప‌దిక‌న స్పందించ‌టం.. ప‌ద‌వుల్ని తృణ‌ప్రాయం అన్న‌ట్లుగా రాజీనామా లేఖ‌ను విసిరికొట్ట‌టం చేసేవారు కేసీఆర్‌. నిజానికి ఈ తీరే తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు కీల‌క‌మైంద‌ని చెప్పాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు తెలంగాణ కోసం ప్ర‌జ‌లు ఎంత‌గా త‌పిస్తున్నార‌న్న విష‌యాన్ని ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో చెప్ప‌క‌నే చెప్పేవారు కేసీఆర్‌. మ‌రి.. అలాంటి కేసీఆర్‌.. తాజాగా స‌వాల్ విస‌ర‌టం తెలిసిందే. మంచి పాల‌కుల్ని ప్ర‌జ‌లు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని.. ప్ర‌తిప‌క్షాలు ముంద‌స్తు అంటున్నాయ‌ని.. తాను సిద్ధ‌మ‌ని.. మ‌రి మీరు సిద్ధ‌మా? అంటూ స‌వాల్ విసిరారు కేసీఆర్‌.

సాధార‌ణంగా ప్ర‌తిపక్షాలు స‌వాళ్లు విస‌ర‌టం.. అందుకు స్పంద‌న‌గా అధికార‌ప‌క్షం ఆచితూచి రియాక్ట్ అవుతుంటారు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్‌ లో మాత్రం అధికార‌ప‌క్ష అధినేత కేసీఆరే స‌వాల్ విసిరారు. ముంద‌స్తుకు సిద్ధ‌మ‌నేశారు. మ‌రి.. ఒక ముఖ్య‌మంత్రి నోటి నుంచి స‌వాల్ వ‌చ్చిన త‌ర్వాత విపక్షాలు రియాక్ట్ కాకుండా ఉంటాయా? ముంద‌స్తుకు తాము సిద్ధ‌మ‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఎప్పుడైనా రెఢీ అంటూ తేల్చేశారు.

దీంతో.. బంతి కేసీఆర్ కోర్టులో ఉంది. ఉద్య‌మ‌నేత‌గా ఉన్న వేళ‌.. ఇలాంటి స‌వాళ్ల‌కు వెనువెంట‌నే రియాక్ట్ అయ్యే అల‌వాటున్న కేసీఆర్ తాజాగా మాత్రం కామ్ అయ్యారు. ఆదివారం కేసీఆర్ స‌వాలు విసిరితే.. సోమ‌వారం ఉద‌య‌మే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఉత్త‌మ్‌ తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు.. వామ‌ప‌క్ష నేత‌లు ముంద‌స్తుకు సై అంటూ స్ప‌ష్టంగా చెప్పిన త‌ర్వాత‌.. స్పందించాల్సిన వంతు కేసీఆర్ దే.

ముంద‌స్తు స‌వాలు విష‌యంలో ఉత్త‌మ్ అండ్ కోలు స్పందించిన తీరుకు ప్ర‌తిస్పందిస్తే.. చేతుల్లో ఉన్న అధికారం చేజారిపోవ‌ట‌మే కాదు.. ఎలాంటి ముంద‌స్తు క‌స‌ర‌త్తు లేకుండా రాజీనామాలు చేసేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. అందుకే.. ఆదివారం గాంభీర్యంతో ఎన్నిక‌లు ఎప్పుడైనా సై అన్న కేసీఆర్‌.. సోమ‌వారం కాంగ్రెస్ నేత‌ల రియాక్ష‌న్ చూసిన త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. స‌వాలు విసిర‌టం ఎందుకు? త‌ర్వాత సైలెంట్ గా ఉండ‌టం ఎందుకు? అందుకే.. అంటారు.. మాట అనే ముందు కాస్త ఆలోచించుకోవాల‌ని. అలాకాకుండా అధికారం చేతిలో ఉంది క‌దా అని మాట్లాడితే.. కేసీఆర్ తాజాగా ఎదుర్కొనే ఇబ్బందే ఎదురుకాక త‌ప్ప‌దు.