Begin typing your search above and press return to search.

రేవంత్‌ మాటలకు ఎంతగా హర్ట్‌ అయ్యారంటే..!

By:  Tupaki Desk   |   3 July 2015 4:39 AM GMT
రేవంత్‌ మాటలకు ఎంతగా హర్ట్‌ అయ్యారంటే..!
X
రాజకీయాల్లో ఓర్పు.. సహనం చాలా అవసరం. ఆ విషయం తన రాజకీయ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు. సవాళ్లను తన విజయసోపానాలుగా మలుచుకునే చతురత ఉన్న ఆయన.. అన్ని సందర్భాల్లో కాదన్న విషయాన్ని తాజాగా చెప్పకనే చెప్పారు.

ఎవరైనా.. ఏదైనా సవాలు విసిరితే చాలు.. వెనువెంటనే స్పందించి దానికి కౌంటర్‌గా భారీ ఝులక్‌ ఇచ్చే ఆయన.. ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయిన రేవంత్‌ రెడ్డి బెయిల్‌ మీద బయటకు వచ్చిన సందర్భంగా ఇతర పార్టీల నుంచి అధికారపక్షంలోకి చేరిన నేతల గురించి ప్రస్తావించిన అంశాల మీద స్పందించకపోవటం గమనార్హం.

దమ్ముంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి అందరి చేత రాజీనామా చేయించి.. ఎన్నికలు జరిపించి.. వారిని గెలిపించుకుంటే తాను మళ్లీ మాట్లాడనని.. లేదంటే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ముక్కురాస్తావా అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. విపక్ష నేతగా ఉన్న సందర్భంలో అయితే.. రాజీనామా చేస్తారా? అని అడగటం ఆలస్యం తాను.. తన పార్టీ నేతల చేత పుసుక్కున రాజీనామా చేయించే కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆ మాటలపై స్పందించేందుకు సైతం సుతారం ఇష్టపడకపోవటం గమనార్హం.

ఒక్క కేసీఆర్‌ మాత్రమే కాదు.. తెలంగాణ మంత్రులు.. రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించి ప్రతివిమర్శలు చేసిన వారంతా కూడా రేవంత్‌ మాటల్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారే తప్పించి.. అతగాడు విసిరిన సవాలు గురించి మాత్రం అస్సలు ప్రస్తావించలేదు. సవాళ్లు విసిరినంతనే స్పందించే గులాబీదళం.. తాజాగా మాత్రం తన వైఖరిని కాస్త మార్చుకున్నట్లు కనిపిస్తోంది.