Begin typing your search above and press return to search.

ఎంత లెక్కేసినా ఆరు కనిపించట్లేదట!

By:  Tupaki Desk   |   8 Sep 2019 5:30 AM GMT
ఎంత లెక్కేసినా ఆరు కనిపించట్లేదట!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎంత ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన చేసే ప్రతి పనిలోనూ సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారన్న పేరుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయనకుండే నమ్మకాలు తప్పనిసరిగా ఉంటాయని చెబుతారు. గత ఏడాది ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు (కేసీఆర్ కోణంలో కాదనుకోండి) వెళ్లిన సమయంలోనూ ఆరుకు ఆయనిచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

తన లక్కీ నెంబరు విషయంలో కేసీఆర్ కచ్ఛితంగా ఉంటారన్న పేరుంది. దీనికి తగ్గట్లే ఆయన తీసుకునే పలు నిర్ణయాలు ఆరు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ కారణంతోనే కేసీఆర్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారన్న సమాచారం అందిన వెంటనే.. అందులో ఆరు ఉందా? లేదా? అన్నది చూసుకోవటం అలవాటుగా మారింది.

ఇలాంటి లెక్కలకు భిన్నంగా తాజా మంత్రివర్గ విస్తరణ (కొందరు ప్రక్షాళన అంటున్నారనుకోండి) ఉండటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈసారి మంత్రి వర్గ విస్తరణ ఆరుకు అతీతంగా ఉందన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే.. ఈ రోజు తారీఖు.. 08-09-2019. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ అంకెల్ని మొత్తం కలిపితే వచ్చే సంఖ్య 29. ఈ రెండింటిని కలిపితే వచ్చేది 11. ఆ రెండు అంకెల్ని కూడితే వచ్చేది 2. సంవత్సరాన్ని మినహాయించి కేవలం తేదీ.. నెలను కలిపితే వచ్చేది 17. ఆ రెండు అంకెల్ని కలిపితే వచ్చేది 8. ఇలా ఏ కాంబినేషన్ లో చూసినా ఆరు అంకె కనిపించదు.

సారుకున్న నమ్మకం ప్రకారం ఆరు అంకె ఉండాలి. అయితే.. ఒక లెక్కలో మాత్రం సారుకు లక్కీ అయిన ఆరు వచ్చే అవకాశం ఉంది. అదెలానంటే.. ఏడాది..నెల.. తేదీని కలిపితే వచ్చే రెండుకు.. సాయంత్రం నాలుగు గంటలు కలిపితే ఆరు వస్తుంది.

సాధారణంగా సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ విధానాన్ని లెక్కలోకి తీసుకోరు. సారుకు అవసరమైన ఆరు రావాల్సిందేనని పట్టుబడితే మాత్రం.. అవకాశం ఉందని చెప్పాలి. ఏమైనా.. విస్తరణలో ఆరు కనిపించని పరిస్థితి. ఇదేమీ కాకుండా.. ఆరుగురిని నియమించటం ద్వారా.. ఆరు లెక్కను సారు పరిగణలోకి తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ తీసుకునే పెద్ద నిర్ణయాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించే ఆరు.. ఈసారి మాత్రం అట్టే ప్రాధాన్యత లభించలేదన్న మాట వినిపిస్తోంది.