Begin typing your search above and press return to search.

అదేంది కేసీఆర్..పేదోళ్ల ప్రాణాల మీద ఆటలేంది?

By:  Tupaki Desk   |   1 July 2016 9:27 AM GMT
అదేంది కేసీఆర్..పేదోళ్ల ప్రాణాల మీద ఆటలేంది?
X
సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తీరు కాస్త భిన్నం. ఆయన్ను ఎవరైనా సాయం చేయాలని అడగాలే కానీ.. ఆయన సాయం చేయటానికి వెనుకాడరు. సాయం కోసం అడిగిన మొత్తాన్ని అస్సలు పట్టించుకోరు. మరింత దొడ్డ మనసున్న ఆయనలో మరోకోణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. తరచూ తమది సంపన్న రాష్ట్రమని.. డబ్బులున్న రాష్ట్రంగా గొప్పలు చెప్పుకునే ఆయన.. పేదోళ్ల ప్రాణాలకు శ్రీరామరక్షగా నిలిచే ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విడుదల చేయకుండా నిలిపివేయటం.

108.. ఆరోగ్యశ్రీ పథకం కారణంగా ఎన్ని లక్షల మంది ప్రాణాలు నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ రెండు పథకాల కారణంగానే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నితప్పులు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఆయన పాలనలో అవినీతి ఉన్నప్పటికీ.. అంతకు మించి.. ఆరోగ్య శ్రీ.. 108 పథకాలు పేదవారికే కాదు.. దిగువ మధ్యతరగతి వారికి అండగా నిలిచాయి. ఖరీదైన వైద్యం కూడా చేయించుకునే వీలు కల్పించి.. ఎంతోమంది ప్రాణాల్ని కాపాడింది.

ఎవరి వరకో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైన అనుభవమే చూస్తే.. ఉద్యమకాలంలో వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళుతున్న ఆయన వాహనం.. రోడ్డు మీద యాక్సిడెంట్ కావటంతో కారు ఆపారు. వారిని సాయం కావాలా? అని కోరినప్పుడు.. 108కి ఫోన్ చేశామని.. మరికొద్ది నిమిషాల్లో వచ్చేస్తుందన్నారు. ఆలస్యమవుతుందని తాను భావించినా.. అక్కడి వారు చెప్పినట్లే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చిందని.. ఈ పథకం తనకెంతో నచ్చిందంటూ ఆ మధ్యన కేసీఆర్ తనకు తానుగా చెప్పుకున్నారు.

108 మాదిరే ఆరోగ్య శ్రీ పథకం కూడా. దీనివల్ల కొంతమేర నిధులు పక్కదారి పట్టి ఉండొచ్చేమో కానీ.. కొన్ని లక్షల మంది ఈ పథకం ద్వారా నిజంగా లబ్థి పొందిన పరిస్థితి. మరి.. అలాంటి కీలక పథకానికి తెలంగాణ సర్కారు నిధులు కేటాయించకపోవటంతో ఈ రోజు (శుక్రవారం) ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులకు రూ.450 కోట్ల మేర ఈ పథకం కింద బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పి.. చివరకు రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసుపత్రులు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బులున్న రాష్ట్రంగా చెప్పుకునే ముఖ్యమంత్రి నేతృత్వంలో పైసల కోసం పేదోళ్ల ప్రాణాల్ని పణంగా పెట్టటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారింది. ప్రైవేటు ఆసుపత్రులతో ప్రభుత్వానికి ఏదైనా లొల్లి ఉంటే.. అది వేరుగా చూసుకోవాలే కానీ.. ఇలా లింకులెట్టి పేదోళ్ల ఉసురు పోసుకోవటం సరికాదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ మాటలన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినిపిస్తున్నాయా..?