Begin typing your search above and press return to search.

2019 ఎన్నికలపై కేసీఆర్ జ్యోసం విన్నారా?

By:  Tupaki Desk   |   31 May 2016 7:22 AM GMT
2019 ఎన్నికలపై కేసీఆర్ జ్యోసం విన్నారా?
X
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి రోజులు గడిచే కొద్దీ.. ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా కొందరు ముఖ్యమంత్రుల పరిస్థితి ఉంటుంది. కానీ.. కేసీఆర్ మాదిరి బలోపేతం మాత్రం ఎక్కడా కనిపించదేమో. రోజులు గడిచే కొద్దీ తనకు ప్రత్యామ్నాయం మరెవరూ లేరన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. కనుచూపు మేర తాను తప్ప మరెవరూ కనిపించకుండా చేసుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

అలాంటి కేసీఆర్ పొలిటికల్ విజన్ ఎలా ఉంది? మరో మూడేళ్లకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయన్న అంశం మీద కేసీఆర్ మనసులో ఏముందన్న విషయంపై ఆసక్తి సహజం. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆయన ఆసక్తికర విషయాల్ని చెప్పటమే కాదు.. 2019లో రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయం మీద జోస్యం చెప్పటం విశేషం.

ఇంతకీ ఆయనేం చెబుతారంటే.. దేశ చరిత్రలో 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అధిపత్యం ఉంటుందని.. ఇందులో టీఆర్ ఎస్ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా మెజార్టీ రాదని.. ప్రాంతీయ పార్టీలే నూరుశాతం కీలకపాత్ర పోషించనున్నట్లుగా తేల్చారు. జాతీయ పార్టీలు ఏవీ గొప్పగా లేవన్నారు. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మమత.. తమిళనాడులో జయలలితలు గెలిచారని.. దేశంలోని 200 స్థానాల్లోనే కాంగ్రెస్.. బీజేపీల మధ్య ముఖాముఖి పోరు ఉంటుందన్నారు. మిగిలిన అన్నీ చోట్ల జాతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీల మధ్య కానీ.. ప్రాంతీయ పార్టీల మధ్య కానీ పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తుది ఫలితం చూసినప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలకభూమిక పోషించటం ఖాయమని వివరంగా చెప్పుకొచ్చారు కేసీఆర్. మరి.. ఆయన విశ్లేషణలో ఎంత నిజమన్నది తేలాలంటే మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే.