Begin typing your search above and press return to search.

కేసీఆర్ ముంద‌స్తు దూకుడు వ‌ర‌మా? శాప‌మా?

By:  Tupaki Desk   |   7 Sep 2018 5:30 PM GMT
కేసీఆర్ ముంద‌స్తు దూకుడు వ‌ర‌మా? శాప‌మా?
X
ముంద‌స్తుకు వెళ్ల‌టం ఒక ఎత్తు. ఆ సంద‌ర్భంగా సిట్టింగుల‌కు భారీగా సీట్లు ఇవ్వ‌టం మ‌రో ఎత్తు. ఈ రెండు సాహ‌సాల్ని చేసేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. ముంద‌స్తుకు వెళ్ల‌ట‌మే ఒక సాహ‌సంగా.. నిప్పుల మీద నడ‌క‌గా చెబుతారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తెలుగునాట ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ముంద‌స్తును చూస్తే.. ఆత్మ‌విశ్వాసంతో ముంద‌స్తుకు వెళ్లిన ప్ర‌తిసారీ అధికార‌ప‌క్షానికి దెబ్బ ప‌డిన సంద‌ర్భాలే ఎక్కువ‌.

అదే స‌మ‌యంలో ఏదైనా బ‌ల‌మైన కార‌ణంతో ముంద‌స్తుకు వెళ్లిన‌ప్పుడు మాత్రం రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నం ల‌భించింది. ఇదిలా ఉంటే.. ముంద‌స్తులో సిట్టింగుల‌కు భారీగా సీట్లు ఇచ్చిన ప్ర‌యోగ ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. ముంద‌స్తుకు వెళ్లేందుకు డిసైడ్ అయిన కేసీఆర్‌.. సిట్టింగుల‌కు భారీగా టికెట్లు ఇచ్చారు.

గ‌తంలో తాను చెప్పిన మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే ఎక్కువ సీట్ల‌ను సిట్టింగుల‌కు కేటాయించారు. మ‌రి.. ఈ ప్రయోగం ఏమ‌వుతుంది. ఇలా ప్ర‌య‌త్నించిన వారికి ఎదురైన అనుభ‌వం ఎలాంటిది? అన్న విష‌యాల్లోకి వెళితే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అధికారంలో ఉన్న ప‌లువురు అధినేత‌లు ముంద‌స్తుకు వెళ్లి.. సిట్టింగుల‌కు భారీగా సీట్లు ఇచ్చి దెబ్బ తిన్నోళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్నే చూస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగులంద‌రికి సీట్లు ఇచ్చింది. వాతావ‌ర‌ణం సానుకూలంగా ఉన్న‌ట్లు క‌నిపించినా.. బీజేపీ కంటే త‌క్కువ స్థానాల్ని సొంతం చేసుకొని రెండో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన‌ట్లుగా కుమార‌స్వామితో కుదిరిన పొత్తుతో అధికార‌ప‌క్షంగా మారింది.

వాస్త‌వానికి ఎన్నిక‌ల వేళ‌లోనే కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం కానీ సిట్టింగుల‌ను ప‌క్క‌న పెట్టి గెలుపు గుర్రాలను మాత్ర‌మే బ‌రిలోకి దించాల‌న్న నిక్క‌చిత‌నంతో ఉండి ఉన్న‌ట్లైయితే.. మ‌రో 15 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో ప‌డ‌తాయ‌న్న విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా ఆ పార్టీ గుర్తించింది.

ఇలాంటి ప‌రిస్థితి ఒక్క క‌ర్ణాట‌క ఉదంతంలోనే కాదు.. మ‌రికొన్ని రాష్ట్రాల్లోనూ ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా తెలంగాణ‌లో చూస్తే.. మొత్తం సిట్టింగుల‌లో 30 మంది వ‌ర‌కూ తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ప‌క్క‌న పెట్టి మిగిలిన వారికి సీట్లు ఇస్తార‌ని భావించారు.కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్ర‌క‌టించిన 105 స్థానాల్లో కేవ‌లం ఇద్ద‌రికి మాత్ర‌మే టికెట్లు ద‌క్క‌లేదు. మిగిలిన వారంద‌రికి టికెట్లు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం ద్వారా కేసీఆర్ భారీ జూదానికి తెర తీశార‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. చివ‌రి నిమిషంలో తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వ‌రిస్తే చెప్ప‌లేం కానీ. లేదంటే క‌నిష్ఠంగా 30 సీట్ల‌లో గెలుపు మీద ప్ర‌భావం చూపించే అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లీ టికెట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించార‌న్న మాట వినిపిస్తోంది.