Begin typing your search above and press return to search.

కేసీఆర్ గెలిస్తే ఆ ఇద్ద‌రూ మంత్రులే!

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:12 PM GMT
కేసీఆర్ గెలిస్తే ఆ ఇద్ద‌రూ మంత్రులే!
X
కొంత‌కాలంగా కేసీఆర్ ప్ర‌సంగాల‌ను గ‌మ‌నిస్తే కేసీఆర్ రెండు మంత్రి ప‌ద‌వులు ఖ‌రారు చేస్తూ హింట్ ఇచ్చాడు. ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి క‌నుక గెలిస్తే ఆ ఇద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు గ్యారంటీ అని కేసీఆర్ మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ఆ ఇద్ద‌రు ఎవ‌రు? ర‌ండి తెలుసుకుందాం.

ప్ర‌తిరోజు ఐదారు స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తున్న కేసీఆర్ దాదాపు రాష్ట్రమంత‌టా క‌లియ‌తిరుగుతున్నారు. మిగ‌తా చోట్ల త‌న అభ్య‌ర్థి సామ‌ర్థ్యాల‌ను కేసీఆర్ వివ‌రిస్తున్న తీరు జ‌నాల్లోకి నేరుగా వెళ్తోంది. అయితే కేసీఆర్ ప్ర‌తి మాట‌కు - ప్ర‌తి ప‌దానికి ఒక అర్థం ఉంటుంది. ఆలోచించ‌కుండా ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడ‌డు. ఇంకా చెప్పాలంటే... రీసెర్చ్ లేకుండా ఏ ప్ర‌సంగ‌మూ చేయ‌డు. అందుకే కేసీఆర్ ప్ర‌సంగాలంటే జ‌నాల‌కు చాలా ఆస‌క్తి.

మొన్న వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం నిర్వ‌హించిన కేసీఆర్ అక్క‌డి అభ్య‌ర్థి నిరంజ‌న్‌ రెడ్డి స‌త్తా ఏంటో జ‌నాల‌కు చెప్పారు. *నిరంజన్‌ రెడ్డి పట్టుబట్టి చెరువులు నింపిండు. వనపర్తి జిల్లా కేంద్రం అయింది కాబట్టి ట్రిపుల్‌ ఐటీ - మెడికల్‌ కాలేజీ వస్తాయి. నిరంజన్‌ రెడ్డిని గెలిపిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడు. ఆయన స్థాయి పెరుగుతది* అని అన్నారు. నిరంజన్‌ రెడ్డిని గెలిపించుకుని వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఏంటి దీని అర్థం. మీరు ఆయ‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి. మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఆయ‌న స్థాయి నేను పెంచుతాను...అని కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారు. మ‌ళ్లీ ఈరోజు వ‌ర‌కు మ‌రే నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆ మాట అన‌లేదు. తాజాగా ఈరోజు రెండో సారి ఆ మాట అన్నారు కేసీఆర్‌?

ఈరోజు చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక అభ్య‌ర్థి బాల్క‌ సుమన్ గురించి గొప్పగా చెప్పారు. *సుమన్ నా ఇంట్లో బిడ్డలాంటివాడు. మీ ప్రాంతం అభివృద్ధికి ఏం కావాలన్నా..నాతోని కొట్లాడి తెచ్చేంత శక్తి సుమన్‌కు ఉంది. భారీ మెజార్టీతో గెలిపించండి. ఆయన గెలిస్తే సాధారణ ఎమ్మెల్యేగా ఉండడు. ఉన్నతమైన స్థానంలో ఉంటడు. మీకు చాలా లాభం జరుగుతది* అని వ్యాఖ్యానించారు కేసీఆర్‌. వ‌న‌ప‌ర్తి త‌ర్వాత మ‌ళ్లీ ఇక్క‌డే కేసీఆర్ ఇలా మాట్లాడాడు. సుమ‌న్ గెలిస్తే మంత్రి అవుతాడు అని కేసీఆర్ దాదాపు స్ప‌ష్టం చేసిన‌ట్టే అనుకోవాలి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ స్థాయిలో మిగ‌తా అభ్య‌ర్థులు ఎవ‌రికీ కేసీఆర్ హింట్ ఇవ్వ‌లేదు. అంటే...టీఆర్ ఎస్ గెలిచి... ఈ ఇద్ద‌రు క‌నుక ఎమ్మెల్యేలు అయితే వారికి మంత్రి ప‌ద‌వులు గ్యారంటీ అనుకోవ‌చ్చు. మ‌రి మ‌రిన్ని అంచ‌నాలు వేసుకోవాలంటే... డిసెంబ‌రు 11 దాకా ఆగాల్సిందే!