Begin typing your search above and press return to search.

పారాసిటమాల్ మాటల్ని కేసీఆర్ ఆపరా?

By:  Tupaki Desk   |   15 March 2020 12:30 PM GMT
పారాసిటమాల్ మాటల్ని కేసీఆర్ ఆపరా?
X
కొన్ని సందర్భాల్లో మాటల దూకుడుకు పగ్గాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసే అంశాల విషయంలో అనవసరమైన రచ్చకు అవకాశం ఇవ్వకుండా ఉండటం మంచిదే. అదే సమయంలో.. ధీమా పేరుతో చెప్పే మాటలు వాస్తవానికి దూరంగా ఉండటం కూడా సరికాదు. కరోనా వైరస్ మీద తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. తనకో శాస్త్రవేత్త ఫోన్ చేశారని.. కరోనా గురించి ఆగం కావాల్సిన అవసరం లేదని.. పారాసిటమాల్ గోళి వేసుకుంటే సరిపోతుందని.. తనకు చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఇలాంటివి చెప్పేటప్పడు తనకు తెలిసినట్లుగా చెప్పకుండా.. తనకు ఫలానా వారు చెప్పారని.. చెప్పిన వ్యక్తి ప్రొఫైల్ బాగుండటంతో తాను కూడా ఆయన మాటల్ని చెబుతున్నట్లుగా చెబుతారే కానీ.. ఎక్కడా తన సొంత మాటలుగా చెప్పరు. ఈ లక్షణం చాలామంది అధినేతల్లో కనిపించదు. అయితే.. ఇలాంటి మాటల విషయంలోనూ కేసీఆర్ కొన్నిసార్లు తప్పులు చేయటం.. ఆయన మాటలు సోషల్ మీడియాలో ఎటకారంగా మారిపోతున్న పరిస్థితి.

కరోనాను పారాసిటమాల్ తో కంట్రోల్ చేయొచ్చన్న సీఎం కేసీఆర్ మాటలు ఎంతలా పాపులర్ అయ్యాయో చెప్పక తప్పదు. తాజాగా.. కరోనా మీద ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. ఎందుకంటే.. కరోనా వ్యాప్తి విషయంలో కేసీఆర్ విజన్ కొంతమేర ఓకే అయినా.. పూర్తిగా చూస్తే..కొన్నిపాయింట్లను ఆయన వదిలేసినట్లుగా కనిపించకమానదు. కొన్నిసార్లు నిజం చెబితే అనవసరమైన కంగారు చోటు చేసుకుంటుందని భావిస్తే.. అబద్ధాల్ని చెప్పాల్సిన అవసరం లేకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది. కానీ.. ఆ లాజిక్ ను కేసీఆర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. ‘‘కరోనాపై ప్రజలెవరూ భయపడొద్దు. తెలంగాణవాసులకు కరోనా రాలేదు. ఫారిన్ నుంచి వచ్చినోళ్లకు కరోనా వస్తోంది. ఈ వైరస్ విదేశాల నుంచి రాష్ట్రానికి రావాలి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఓడరేవులు లేవు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఒక్కటే ఉంది. దీని ప్రభావం హైదరాబాద్ పరిసరప్రాంతాల మీదనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి భయంలో లేదు’’ అని చెప్పటం బాగానే అనిపించినా.. కొన్ని సాంకేతిక అంశాల మీద మరింత మెరుగ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే.. సారు చెప్పినట్లుగా కరోనా వైరస్ తెలంగాణలో లేదు. విదేశాల నుంచి వస్తున్న వారితోనే సమస్య. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది మరో ప్రశ్న. విమాన ప్రయాణాలతోనే వస్తుందని చెప్పిన కేసీఆర్.. తెలంగాణలోని తొలి కరోనా వైరస్ (ఈ వ్యక్తి ఇప్పటికే కోలుకున్నాడు) .. తొలి కరోనా మరణం.. తాజాగా అనుమానిస్తున్న రెండు అనుమానిత కేసుల విషయంలోనూ విమానాశ్రయం నుంచి నేరుగా వచ్చింది కావు. దేశంలోని ఇతర ఎయిర్ పోర్టుల్లో నుంచి బస్సుల్లోనూ.. ఇతర వాహనాల్లో ప్రయాణించి వచ్చిన కేసుల కారణంగానే కరోనా వెలుగు చూసిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు?

సారు చెప్పినట్లు కరోనా వైరస్ మన దగ్గర పుట్టలేదు. అక్కడెక్కడో చైనాలో పుట్టింది. మారిన పరిస్థితుల కారణంగా.. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన నేపథ్యంలో.. వైరస్ వ్యాపించే అవకాశాల్ని తగ్గిస్తే సరిపోతుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా.. మరిన్ని అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా భయం లేదని చెప్పే బదులు.. జాగ్రత్తగా ఉండాలన్న మాట కేసీఆర్ నోట వస్తే బాగుంటుందన్నది మర్చిపోకూడదు. కరోనా విషయంలో మొదట్లో కేసీఆర్ చెప్పినట్లుగా.. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ సింఫుల్ గా తేల్చేసిన రీతిలో కాకుండా.. ఎంత అవసరమో అంతకు తగ్గట్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది.