Begin typing your search above and press return to search.

సీఎంతో దాగుడు మూత‌లు ఆడుతోన్న ఎంపీ

By:  Tupaki Desk   |   14 July 2019 5:44 AM GMT
సీఎంతో దాగుడు మూత‌లు ఆడుతోన్న ఎంపీ
X
తెలంగాణలో మహా మహా రాజకీయ నాయకులను.... కాంగ్రెస్. బిజెపీలో తలపండిన నేతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే సీఎం కేసీఆర్‌ నే సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ తెగ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఆ ఎంపీ ఇచ్చిన షాక్‌ తో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియని డైలమాలో కేసీఆర్ పడటం విశేషం. అసలు విషయంలోకి వెళితే టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ సీఎం కేసీఆర్ మధ్య ఇప్పుడు ఎత్తులు... పై ఎత్తుల‌తో కూడిన రాజకీయం నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు దాగుడు మూతల రాజకీయం ఆడుతున్నారు. దాదాపు యేడాదిన్నర కాలంగా కేసీఆర్‌ తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజా లోక్‌ స‌భ ఎన్నికల్లో డీఎస్ కేసిఆర్ కు అదిరిపోయే షాక్ ఇచ్చారు.

నిజామాబాద్‌ లో బీజేపీ నుంచి పోటీ చేసిన డీఎస్ త‌న‌యుడు ధ‌ర్మ‌పురి అరవింద్ కేసీఆర్ కుమార్తె క‌విత‌పై ఘ‌న‌విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో డీఎస్ తెర‌వెన‌క త‌న‌యుడికే స‌పోర్ట్ చేశార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. అదే టైంలో గ‌తంలో త‌న‌తో పాటు ఉన్న కాంగ్రెస్ కేడ‌ర్‌ ను కూడా బీజేపీకి ప‌నిచేసేలా డీఎస్ చ‌క్రం తిప్పారు. ఓవ‌రాల్‌గా డీఎస్ మంత్రాంగంతో అక్క‌డ కాంగ్రెస్ + బీజేపీ శ్రేణులు క‌లిసి ప‌నిచేసి మ‌రీ క‌సితీరా క‌విత‌ను ఓడించాయి. ఇదంతా కేసీఆర్‌ కు తెలియంది కాదు.

త‌న పార్టీలోనే ఉంటూ... తాను ఎంపీ ప‌ద‌వి ఇస్తే ఇప్పుడు ఏకంగా త‌న కుమార్తెను డీఎస్ ఓడించ‌డంతో కేసీఆర్ తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. ఇంత జ‌రుగుతున్నా డీఎస్ తాజాగా టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగ్‌ కు హాజ‌రై కేసీఆర్‌ ను మ‌రింత‌ ఉడికించేస్తున్నారు. డీఎస్ బీజేపీలో చేర‌డం ఖాయ‌మే. ఆయ‌న త‌న‌తో పాటు మ‌రికొంత మంది టీఆర్ ఎస్ కీల‌క నేత‌ల‌ను కూడా లాక్కెళ్లాల‌న్న ప్లాన్‌ లో ఉన్నారు. పార్టీలోనే ఉంటూ టీఆర్ ఎస్‌ కు షాకులు ఇస్తున్నారు. త‌నంత‌ట తానుగా పార్టీని వీడ‌కుండా పార్టీ నుంచి స‌స్పెండ్ చేసేలా డీఎస్ చ‌ర్చ‌లు ఉన్నాయి.

డీఎస్ త‌నంత‌ట తానే పార్టీ వీడిపోతాడ‌ని కేసీఆర్ అనుకుంటుంటే ఆయ‌న మాత్రం త‌న ప‌ట్ల పార్టీ వైఖ‌రి ఎలా ఉందో ? అంచ‌నా వేసుకోవ‌డంతో పాటు టీఆర్ ఎస్ అసంతృప్తవాదుల‌ను ఒకే తాటిమీద‌కు తీసుకు వ‌చ్చాకే పార్టీ మార‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటున్నారు. తాజాగా ఆయ‌న పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశానికి రావ‌డం వెన‌క కూడా ఇవే ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ఈ స‌మావేశంలో డీఎస్ త‌మ‌తో కేవలం 20 నిమిషాలు మాత్రమే తమతో ఉన్నారని - టీ తాగడం మినహా పార్టీ వ్యవహారాలపై ఎలాంటి చర్చ జరపలేదని టీఆర్ ఎస్ నేత‌లు చెపుతున్నారు. ఏదేమైనా డీఎస్ వ‌ర్సెస్ కేసీఆర్ మ‌ధ్య న‌డుస్తోన్న ఈ దాగుడు మూత‌ల రాజ‌కీయం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా ఉంది.