Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు భయమా..? ఆత్మవిశ్వాసమా..?

By:  Tupaki Desk   |   12 July 2018 2:30 PM GMT
కేసీఆర్‌ కు భయమా..? ఆత్మవిశ్వాసమా..?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈమధ్య చీటికీ మాటికీ ఎన్నికల ప్రస్తావన తీసుకువస్తున్నారు. శాసనసభ - లోక్‌ సభలకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఒకసారి... లేదూ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు... శాసనసభ్యులతోనూ - లోక్‌ సభ సభ్యులతోనూ ఎన్నికలపై చర్చిస్తున్నారు. తాజాగా శాస‌న‌స‌భ్యుల‌కు ఫోన్లు చేసి ఎన్నిక‌లు స‌మీపించ‌నున్నాయ‌ని, ముంద‌స్తు అయినా... షెడ్యూల్ ప్రకార‌మే అయినా మీరంతా సిద్ధంగా ఉండాలంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలా ఇంత‌కు ముందు ఎప్పుడూ ముఖ్యమంత్రి ప్రవ‌ర్తించ‌క‌పోవ‌డంతో పార్టీ నాయ‌కులు - శాస‌న‌స‌భ్యులు కూడా కాసింత ఆశ్చర్యానికి గుర‌వుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చేసిన ఫోన్‌ లో ఎన్నిక‌లు ముందుగానైనా రావ‌చ్చు.. షెడ్యూల్ ప్రకార‌మైనా రావ‌చ్చు అని చెప్పడం వారికి నవ్వు తెప్పించింద‌ట‌.

అవును మ‌రి... ఎన్నిక‌లు ఎక్కడైనా ముందుగానైనా వ‌స్తాయి లేదూ అంటే షెడ్యూల్ ప్రకార‌మైనా వ‌స్తాయి క‌దా... దీనికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ‌ర రావు ఈ విధంగా ఫోన్లు చేయ‌డ‌మేమిట‌ని వారంతా గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌. దీనికి కార‌ణం ఏమై ఉంటుందా అని వారంతా త‌ల‌లు ప‌ట్టుకుటున్నట్లు స‌మాచారం.

ఎన్నిక‌లంటే కె.చంద్రశేఖ‌ర రావులో భ‌యం ప్రారంభ‌మైంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తుంటే... మ‌రి కొంద‌రు మాత్రం దీనికి కార‌ణం ఆయ‌న అతి ఆత్మ విశ్వాస‌మేన‌ని అంటున్నారు. గ‌తంతో పోలిస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ‌ర‌రావులో విజ‌యం ప‌ట్ల భ‌యం ప‌ట్టుకుంద‌ని, గ‌తంలో ఉన్నంత ఆత్మ విశ్వాసం ఇప్పుడు కెసిఆర్‌లో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌కు కార‌ణాలు అన్వేషిస్తున్న వారికి రెండు కార‌ణాలు క‌నిసిస్తున్నాయ‌ట‌. అందులో మొద‌టిది తెలంగాణ‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏకం అయ్యేందుకు ప్రయ‌త్నిచ‌డ‌మైతే... రెండోది తాను భార‌తీయ జ‌న‌తా పార్టీతో స‌ఖ్యంగా ఉండ‌డ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు క‌లిస్తే తెలంగాణ‌లో త‌న‌కు ఇబ్బందేన‌ని ముఖ్యమంత్రి కెసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో కాసింత ప‌ట్టుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బ‌లం పుంజుకుంటోంది. ఈ రెండూ క‌లిస్తే త‌న‌కు ఇబ్బందేన‌ని సిఎం ఆందోళ‌న చెందుతున్నార‌ని స‌మాచారం. ఇక భార‌తీయ జ‌న‌తా సార్టీతో తాను స‌ఖ్యంగా ఉండ‌డం వ‌ల్ల వారితో చాలా జాగ్రత్తగా వ్యవ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని, లేక‌పోతే వారి ఎత్తుగ‌డ‌ల ముందు తాను చిత్తు అయ్యే అవ‌కాశం ఉంద‌ని సిఎం క‌ల‌తతో ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ రెండు కార‌ణాల‌తోనే కె.చంద్రశేఖ‌ర రావు మాటి మాటికీ ముంద‌స్తు... షెడ్యూల్ ప్రకారం ఎన్నిక‌లు అంటూ మాట్లాడుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.