Begin typing your search above and press return to search.

మేధావి కేసీఆర్‌..చిన్న లాజిక్ మిస్ కావ‌ట‌మేంది?

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:06 AM GMT
మేధావి కేసీఆర్‌..చిన్న లాజిక్ మిస్ కావ‌ట‌మేంది?
X
కేసీఆర్ గురించి ఎవ‌రైనా చెప్పాల్సి వ‌స్తే.. ఆయ‌న మేధావిత‌నాన్ని.. వ్యూహ‌చ‌తుర‌త‌ను.. ప్ర‌త్య‌ర్థికి అంద‌ని రీతిలో ఎత్తులు వేసే వైనాన్ని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటారు. మ‌రి..అంత‌టి తెలివైన అధినేత త‌ప్పులు చేస్తారా? అంటే నో అనేస్తారు ఆయ‌న్ను ఆరాధించేవారంతా. కానీ.. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. అంత పెద్ద కేసీఆర్ మ‌రీ ఇంత సింఫుల్ త‌ప్పులు ఎందుకు చేస్తున్నారు? అన్న భావ‌న క‌ల‌గ‌ట‌మేకాదు.. చిన్న చిన్న లాజిక్ లు మిస్ అవుతూ త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నారే? అన్న సందేహం రాక మాన‌దు.

తెలంగాణ‌లో కేసీఆర్‌ కు తిరుగులేదు. ఆ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి అనుమానం లేదు. మ‌రి.. అలాంటి కేసీఆర్ అభ్ర‌ద‌త‌తో అన‌వ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. కొడుకును పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయ‌టం ద్వారా.. త‌న త‌ర్వాతి స్థానం కేటీఆర్ దేన‌న్న విష‌యాన్ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ నిర్ణ‌యంపై.. బ‌య‌ట అంద‌రూ అనుకునేలా హ‌రీశ్ పెద్ద‌గా ఫీలైంది లేదు. త‌న స్థానం ఏమిటో.. కేటీఆర్ స్థానం ఏమిట‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఎక్కువ ఆశ‌లు పెట్టుకోలేద‌న్న మాట ఆయ‌న స‌న్నిహితులు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెబుతుంటారు. మ‌రి.. అలాంటి హ‌రీశ్ మీద క‌త్తి క‌ట్టిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంలో అర్థం ఏమైనా ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఎన్నిక‌ల వేళకు కాస్త ముందు నుంచీ త‌మ సొంత ప‌త్రిక‌లో హ‌రీశ్ బొమ్మ క‌నిపించకుండా చేసిన వైనం పెద్ద చ‌ర్చ‌నే రేపింది. ఎన్నిక‌ల్లో ఎదురుగాలి వీస్తుంద‌న్న భావ‌న క‌లిగిన వెంట‌నే టాస్క్ మాస్ట‌ర్ గా గుర్తింపు పొందిన హ‌రీశ్ ను ద‌గ్గ‌ర‌కు తీయ‌ట‌మే కాదు.. అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న వార్త‌లే అచ్చేయ‌ని కేసీఆర్ ప‌త్రిక‌.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం మొద‌లెట్టింది.

ఇలా అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా హ‌రీశ్ పై క‌త్తి క‌ట్టిన‌ట్లుగా కెల‌క‌టం కేసీఆర్ త‌రచూ చేస్తున్నార‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. కొడుక్కి అధికార పీఠాన్ని క‌ట్ట‌బెడ‌తానంటే కాద‌నేటోడు తెలంగాణ‌లో ఎవ‌రూ లేరు. అలాంటి వేళ‌.. హ‌రీశ్ ను అన‌వ‌స‌రంగా దూరం పెట్ట‌టం వెనుక లాజిక్ ఏమిటో అర్థం కాదు.

కొడుకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి.. మంత్రి ప‌ద‌వి చేప‌డితే బాగోద‌న్న ఉద్దేశంతో దూరంగా పెట్ట‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌మాత్రానికే హ‌రీశ్ ను తీసుకోకుండా ఉండ‌టంలో క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటన్న దానిపై కేటీఆర్ ను అమితంగా ఆరాధించే వారు సైతం జ‌వాబు చెప్ప‌లేని ప‌రిస్థితి. హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే ప‌వ‌ర్ పాయింట్ గా మార‌తార‌న్న కేసీఆర్ ఆలోచ‌న (?) త‌ర్క‌బ‌ద్ధం కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

హ‌రీశ్ ప‌ట్ల ఎలాంటి శంక ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆయ‌న్ను ఆద‌రించి.. ప‌ద‌వుల్ని క‌ట్ట‌బెట్టిన‌న్నాళ్లు కేసీఆర్ మీద ప్ర‌జ‌ల్లో ఎలాంటి అనుమానాలు ఉండ‌వు. అలా చేసిన త‌ర్వాత హ‌రీశ్ ఎప్పుడైనా తొంద‌ర‌ప‌డితే.. తెలంగాణ స‌మాజం ఆయ‌న్ను క్ష‌మించ‌దు స‌రిక‌దా.. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు చెక్ చెప్ప‌టం ఖాయం. కానీ.. అందుకు భిన్నంగా అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌ల‌తో హ‌రీశ్ ను దూరం పెట్టిన కొద్దీ.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు సానుభూతి పెర‌గ‌టం.. కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త రావ‌టం ఖాయం. ఎంత మంచి టైర్ అయినా.. గాలి సామర్థ్యానికి మించి పెడుతూ ఉంటే ప‌గిలిపోతుంది. ఆ ఉదాహ‌ర‌ణ‌కు హ‌రీశ్ అతీతం కాదు.

త‌న‌ను అదే ప‌నిగా అవ‌మానిస్తూ.. త‌న‌ను విశ్వాసంలోకి తీసుకోని వైనాన్ని హ‌రీశ్ గుండెల్లో పెట్టుకుంటాడే కానీ.. ఏ మాత్రం బ‌య‌ట‌ప‌డ‌రు. ఎందుకంటే.. కేసీఆర్ అంటే ఆయ‌న‌కు అంత అభిమానం. త‌న మేన‌మామ త‌న ఉన్న‌తికి ఎంతో చేశార‌ని.. అలాంటి ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగే ప‌నిని క‌ల‌లో కూడా చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న హ‌రీశ్ లో క‌నిపిస్తూ ఉంటుంద‌ని చెబుతుంటారు. గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రంటే భుజాలు త‌డుముకుంటున్న‌ట్లుగా.. విధేయుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎలాంటి త‌ప్పులు ఇప్ప‌టివ‌ర‌కూ రిజిష్ట‌ర్ కాని హ‌రీశ్ మీద కేసీఆర్ క‌త్తి క‌ట్ట‌టం.. తెలంగాణ స‌మాజంలో త‌న ఇమేజ్ ను తానే దెబ్బ తీసుకుంటున్నాన్న చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు? రేపొద్దున త‌న‌కు ఎదురైన అవ‌మానాల‌పై గ‌ళం విప్పితే.. కేసీఆర్ త‌ప్పుల చిట్టా క‌నిపిస్తుందే త‌ప్పించి.. హ‌రీశ్ చేసింది త‌ప్పు అన్న మాట ఎవ‌రి నోటి నుంచి రాద‌న్న విష‌యాన్ని టీఆర్ఎస్ అధినేత ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు?