Begin typing your search above and press return to search.
హైకోర్టు అంటే ...కేసీఆర్ కు ఓ సెంటిమెంట్!
By: Tupaki Desk | 28 July 2018 7:01 PM GMTఅదేమి జాతకమో కాని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల వారు పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయనను హైకోర్టు తప్పుపడుతూనే ఉంది. ఇప్పటి వరకూ హైకోర్టు మెట్లు ఎక్కిన ఏ కేసులోనూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు అనుకూల తీర్పు రాలేదు. హైకోర్టుకు ఏదైనా కేసు వెళితే చాలు.. కేసీఆర్ జడిసే పరిస్థితి ఉంది.
తాజాగా కాంగ్రెస్ ఎంఎల‌్ ఎల బహిష్కరణ వేటుపై కూడా హైకోర్టు చివాట్లు పెట్టింది. శాసన సభ నుంచి కాంగ్రెస్ ఎంఎల్ ఎలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి - సంపత్ లను బహిష్కరించడం తగదని గతంలోనే తీర్పిచ్చింది ఆ తీర్పుతో శాసన సభ్యులకు ఉండే అధికారాలు - హక్కులు - సౌకర్యాలు తమకూ కల్పించాలని ఆ ఇద్దరు ఎంఎల్ ఏలు శాసన సభ అధికారులను కోరారు. అయితే ఈ విషయంలో శాసనసభ నుంచి కాని - అధికారుల నుంచి కాని ఎలాంటి స్పందన రాలేదు. శాసన సభ్యులుగా తమ హక్కులను కాలరాస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంఎల్ ఎలు తిరిగి కోర్టును ఆశ్రయించారు.
దీంతో హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ జే. రామచంద్ర రావుపై " కోర్టు ధిక్కారం చేస్తారా.... ఏం తమాషాగా ఉందా" అంటూ ఆగ్రహించింది. ఎంఎల్ ఎలకు అధికారాలు కట్టబెట్టడంపై తనకు అవకాశమూ - అధికారమూ రెండూ లేవని అదనపు అడ్వకేట్ జనరల్ విన్నవించుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి కాంగ్రెస్ శాసన సభ్యులపై కేసీఆర్ ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడయింది. కోర్టు కేసులతో - వాటి తీర్పులతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆయుధం దొరికినట్లు అయింది.
కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో ఇద్దరి సస్పెన్షన్... కేసీఆర్ కు పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఇది కాంగ్రెస్ కు రెండు సీట్లు పోగొట్టినా అంతకుమించిన సానుభూతిని రాబట్టింది. ఇప్పటికే నగరాల్లో కేసీఆర్ సర్కారు బాగానే బండి లాక్కొస్తున్నా... గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో క్రమంగా ఒక్కో అడుగు పైకెక్కుతుంది.