Begin typing your search above and press return to search.

కేసీఆర్ వీరాభిమానికి పెద్ద క‌ష్టం!

By:  Tupaki Desk   |   10 July 2018 6:40 AM GMT
కేసీఆర్ వీరాభిమానికి పెద్ద క‌ష్టం!
X
తెలంగాణ ఉద్య‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి గుర్తుందా? అప్ప‌టివ‌ర‌కూ కామ్ గా ఉన్న‌ట్లు ఉండి.. ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగి.. దాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకునే అవ‌కాశం వ‌స్తే చాలు వెంట‌నే విరుచుకుప‌డే ధోర‌ణిని త‌ర‌చూ ప్ర‌ద‌ర్శించేవారు.

ప్ర‌తి విష‌యంలోనూ తెలంగాణ సెంటిమెంట్‌ ను వెతికి మ‌రీ చెప్పే కేసీఆర్‌.. మొత్తానికి తాను అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఏకంగా రాష్ట్రానికి మొద‌టి ముఖ్య‌మంత్రి అయ్యారు కూడా. ఉద్య‌మ వేళ‌లో అందులో పాల్గొన్న వారికి ఏదైనా క‌ష్టం వ‌చ్చినంత‌నే స్పందించి..వారి క‌ష్టాన్ని త‌న క‌ష్టంగా ఫీల‌వుతూ.. భావోద్వేగాన్ని తెలంగాణ వ్యాప్తంగా స్ప్రెడ్ చేసిన కేసీఆర్‌.. ముఖ్య‌మంత్రి అయ్యాక మాత్రం అలా చేయ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా మ‌హ‌బూబాబాద్ కుర్రాడు జితేంద‌ర్ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఉద్య‌మం ఉవ్వెత్తున సాగుతున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జితేంద‌ర్ ఉద్య‌మ గోదాలోకి దిగాడు. ఉస్మానియా వ‌ర్సిటీలో పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బ‌లు తిన్నాడు.

ఉద్య‌మం కోసం క‌ష్టాన్ని భ‌రించాడు. కేసీఆర్ ను విప‌రీతంగా ఆరాధించే జితంద‌ర్ పార్టీకి ఏదైనా న‌ష్టం జ‌రుగుతుంటే.. త‌న‌కే జ‌రిగిన‌ట్లుంగా రియాక్ట్ అయ్యేవాడు. ఇలా సాగుతున్న ఆయ‌న‌.. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌..టీడీపీల మ‌హాకూట‌మికి అనుకూలంగా ప‌ని చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న గొడ‌వ‌లో కేసుల్లో చిక్కుకున్నాడు.

అత‌న్ని కావాల‌ని కొంద‌రు ఇరికించిన‌ట్లు చెబుతారు. ఈ కేసుకు సంబంధించి 2010లో రాజీ కుదుర్చుకొని కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో.. ఇరు వ‌ర్గాలు రాజీకి రావ‌టంతో ఓకే అన్నాడు. ఆ త‌ర్వాత జితేంద‌ర్‌ కు 2014లో ఐదోజోన్ లో ఎస్ ఐ ఉద్యోగాన్ని సాధించాడు. అయితే.. ఆ సంతోషం అత‌డికి ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ఎస్సై శిక్ష‌ణ‌కు అత‌డికి పిలుపు రాలేదు. ఎందుక‌న్న మాట‌కు అధికారులు చెప్పిన స‌మాధానం విని షాక్ తిన్నాడు.

2009లో ఉన్న కేసును రాజీ మార్గంలో తొల‌గించ‌టంతో త‌ప్పు ఒప్పుకున్న‌ట్లే అని.. అలా రాజీ చేసుకున్న కేసుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌ని.. ఉద్యోగ అర్హ‌త ఉండ‌ద‌ని వారు స్ప‌ష్టం చేశారు. దీంతో తీవ్ర నిరాశ‌కు గురైన జితేంద‌ర్‌.. ఈ మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసి త‌న వేద‌న‌ను చెప్పుకొని విన‌తిప‌త్రాన్ని ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా స్పందించి.. జితేంద‌ర్‌ కు ద‌క్కాల్సిన ఉద్యోగాన్ని ఆయ‌న‌కు కేటాయించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. ఉద్య‌మ విన‌తిపై వారం దాటినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కాలేద‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వ‌స్తోంది. మిగిలినోళ్ల సంగ‌తి వ‌దిలేయండి.. మీ వీరాభిమానికి ఇన్ని క‌ష్టాలైతే ఎలా సార్‌..?