Begin typing your search above and press return to search.

కేకే.. నామాలకు కేసీఆర్ క్లాస్ పీకారా?

By:  Tupaki Desk   |   30 Sep 2019 5:04 AM GMT
కేకే.. నామాలకు కేసీఆర్ క్లాస్ పీకారా?
X
అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే ఎవరికైనా చిరగ్గా ఉంటుంది. సామాన్యుడికే ఇంతలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు మరెంత ఉండాలి? తాను కోరినంతనే తీర్చేలా పరిస్థితి ఉండాలనుకోవటం తప్పు లేదు. తన లాంటి బలమైన నేత.. పెద్ద ఎత్తున ఛరిష్మా ఉన్న అధినేత నోరు తెరిచి మద్దతు ఇవ్వండని అడగటమే ఎక్కువనుకుంటే.. ఆలోచించి చెబుతాం.. మీటింగ్ పెట్టుకొని నిర్ణయం ప్రకటిస్తామంటూ కమ్యునిస్టులు చేసిన ప్రకటన కేసీఆర్ ను ఇరిటేట్ చేసినట్లుగా చెబుతున్నారు.

నిజానికి సీపీఐ నేతలతో భేటీ అయ్యేందుకు.. వారి ఆఫీసుకు వెళ్లటానికి ముందే తెర వెనుక సంప్రదింపుల పర్వం స్టార్ట్ అయ్యింది. అంతా ఓకే అయ్యాక.. అందరికి తెలియజెప్పేందుకు సీపీఐ కార్యాలయానికి టీఆర్ ఎస్ నేతలు వెళ్లటం జరిగింది. సీపీఐ నేతలతో భేటీ అనంతరం.. పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చేసి.. అధికారికంగా ప్రకటన ఫలానా రోజున వెల్లడిస్తామన్న మాట చెబుతారన్న అంచనాకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

సీపీఐ నేతలతో భేటీ అయ్యేందుకు టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు.. మరో ఎంపీ నామానాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లతో పాటు మరికొందరు టీఆర్ ఎస్ నేతలు మగ్దూం భవన్ కు వెళ్లటం తెలిసిందే. తాము కోరుకున్నట్లుగా హుజూర్ నగర్ ఉప ఎన్నికకు తమ పార్టీ అధికార టీఆర్ ఎస్ కు మద్దతు ఇస్తుందన్న ప్రకటన చేస్తారని గులాబీ బాస్ భావించారట. అయితే..ఆయన అనుకున్న దానికి భిన్నంగా పరిస్థితులు ఉండటం.. తమ పార్టీ సమావేశం అక్టోబరు ఒకటిన జరగనుందని.. ఈ అంశంపై తాము చర్చించుకొని నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పటంపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమ భేటీకి సంబంధించిన కీలక విషయాల్ని తెలియజేసేందుకు కేకే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. తాము అనుకున్నట్లు జరగకపోవటంపై కేకే.. నామానాలకు క్లాస్ పడినట్లుగా తెలుస్తోంది. తామెంత ప్రయత్నించినా.. తాము అనుకున్నట్లుగా సీపీఐ నేతలు రియాక్ట్ కాకపోవటం ఏమిటంటూ కేసీఆర్ వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి.. సీపీఐ నేతలతో భేటీ కేసీఆర్ కు ఇరిటేషన్ తెచ్చేలా చేసినట్లుగా సమాచారం.