Begin typing your search above and press return to search.

మంత్రిపదవి: నమ్ముకున్నోళ్లకా? వచ్చినోళ్లకా.?

By:  Tupaki Desk   |   1 Sep 2019 5:39 AM GMT
మంత్రిపదవి: నమ్ముకున్నోళ్లకా? వచ్చినోళ్లకా.?
X
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాత ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు ఒక మంత్రి పదవి అయినా దక్కింది. కానీ ఒక్క ఖమ్మం జిల్లా మాత్రం ఆ భాగ్యానికి నోచుకోలేదు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ ఎస్ తరుఫున గెలిచింది ఒక్కరే. ఆయనే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ గెలిచారు. టీఆర్ ఎస్ ను జిల్లా ప్రజలు ఓడగొట్టారన్న పగో లేక.. సరైన నేతల కొరతో తెలియదు కానీ ఇప్పుడు ఖమ్మంకు మాత్రం మంత్రి పదవిపై ఇప్పటికీ ఆశలు నెరవేరడం లేదు..

ఖమ్మం జిల్లా నుంచి గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు తుమ్మల నాగేశ్వరారావు. కానీ ఈసారి మాత్రం ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చేది లేదని కేసీఆర్ స్పష్టం చేయడంతో తుమ్మల ఆశలు మూసుకుపోయాయని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఖమ్మం నుంచి ప్రస్తుతం మంత్రి వర్గం రేసులో ముగ్గురు ఉన్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందులో ప్రధాన పోటీ టీఆర్ ఎస్ జెండాపై గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాగా.. రెండో పోటీదారు టీడీపీ తరుఫున గెలిచి మంత్రిపదవి హామీపై గులాబీ పార్టీలో చేరిన సండ్ర వెంకటవీరయ్య. వీరిద్దరే కాదు.. కాంగ్రెస్ నుంచి గెలిచి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేరేలా చేసిన రేగా కాంతారావుకు ఎస్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెంచుకున్నారు.

ఈ ముగ్గురిలో ప్రధానంగా కేటీఆర్ కు దగ్గరైన పువ్వాడ అజయ్ కే ఈసారి మంత్రి పదవి దక్కవచ్చన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చినందుకు గత హాయాంలో కేసీఆర్ ఎదుర్కొన్న విమర్శలు ఎన్నో.. అందుకే ఈసారికి సండ్ర, రేగా కాంతారావులను పక్కనపెట్టి వారికి ఏదైనా నామినేటెడ్ పదవులతో సంతృప్తిపరిచి పువ్వాడకే మంత్రి పదవి ఇస్తారన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది.