Begin typing your search above and press return to search.

ఈ లెక్క‌ల‌తో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌ట‌మా కేసీఆర్?

By:  Tupaki Desk   |   3 April 2019 6:30 AM GMT
ఈ లెక్క‌ల‌తో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌ట‌మా కేసీఆర్?
X
ఏడాదికి నాలుగు కోట్ల రూపాయిల ప‌న్నుక‌డ‌తాను. మా ఇంటి నుంచి బ‌జారుకు వెళ్లే రోడ్డు స‌రిగా లేదు? నీళ్లు కూడా ఫోర్సుగా రావు? కిటికీలు.. త‌లుపులు తీస్తే స్వ‌చ్చ‌మైన గాలి త‌ర్వాత పాడు వాస‌న‌. రోడ్డు మీద‌కు కారు తీసుకెళితే చిరాకు పుట్టించే ట్రాఫిక్.. ఇలా చెబుతూ పోతే ఎన్నో స‌మ‌స్య‌లు. ఏటా కోట్ల రూపాయిల్ని ప‌న్నుల రూపంలో క‌ట్టేటోడికి చ‌క్క‌టి వ‌స‌తులు క‌ల్పించాల‌న్న బుద్ధి కూడా ప్ర‌భుత్వానికి ఉండ‌దా?

ఆ మాత్రం ఆలోచించే బుర్ర పాల‌కుల‌కు లేదా? స‌న్నాసుల చేతుల్లో అధికారం ఉంటే ఇలానే ఉంటుంది మ‌రి.. అంటూ తిట్టిపోసే వారిని చూస్తే ఏమ‌నిపిస్తుంది. తొలుత వినేందుకు బాగానే ఉన్నా.. ఆలోచిస్తున్న కొద్దీ చిరాకు వేయ‌టం ఖాయం. నాలుగు కోట్లు ప‌న్ను క‌డితే ఆయ‌న్ను నెత్తిన పెట్టుకొని తిప్పాలా? అన్న ప్ర‌శ్న రాక మాన‌దు. ఒక వ్య‌క్తి మాట్లాడే మాట‌ల్ని చుట్టూ ఉన్న స‌మాజం ఎలా హ‌ర్షించ‌దో.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న రాష్ట్రాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంప‌ద‌తో పోలిస్తూ.. చెప్పే వాద‌న కూడా ఇదే త‌ర‌హాలో అనిపించ‌క మాన‌దు.

డ‌బ్బులు ఉన్నాయి.. సంప‌ద వ‌స్తుంది కాబ‌ట్టి కేసీఆర్ చెప్పే మాట‌లు వినేందుకు బాగానే ఉంటుంది. కానీ.. ఒక దేశం అన్న భావ‌నకు కేసీఆర్ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఏ మాత్రం స‌రికాదు. ఇంట్లో న‌లుగురు పిల్ల‌లు ఉంటే.. అంద‌రూ ఒకేలాంటి తెలివి ఉన్నోళ్లు ఉండ‌రు. అంత మాత్రాన తెలివిగా ఉండే పిల్లోడ్ని మాత్ర‌మే త‌ల్లిదండ్రులు ఎక్కువ‌గా ప్రేమించి.. మిగిలిన వారిని చుల‌క‌న‌గా చూస్తే బాగుంటుందా? స‌రిగ్గా ఇదే పోలిక దేశానికి వ‌ర్తిస్తుంది.

దేశాన్ని నాలుగైదు రాష్ట్రాలు పోషిస్తుంద‌న్న సంప‌న్న బ‌లుపు మాట‌లు దేశ స‌మైక్య‌త‌కు ఏ మాత్రం మంచిది కాదు. అలా అని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డ‌మ‌ని చెప్ప‌టం లేదు. కాకుంటే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల పేరుతో విభ‌జ‌న వాదాన్ని.. మిగిలిన వారి కంటే మేం గొప్పోళ్ల‌మ‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరిగితే దేశ స‌మ‌గ్ర‌త‌కే ముప్పు వాటిల్లుతుంది.

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఫీల‌య్యే కేసీఆర్‌.. దానికి ముందు తానో చ‌క్క‌టి కుటుంబ పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఢిల్లీలో చ‌క్రం తిప్పుతాన‌ని త‌ర‌చూ చెప్పే ఆయ‌న‌.. త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో భాగ‌స్వాములుగా చెప్పే ఒడిశా..ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాలు పేద‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాను క‌లిసి న‌డవాల‌నుకున్న భాగ‌స్వామ్య ప‌క్షాలకు సైతం మంట పుట్టే కేసీఆర్ వాద‌న ఆయ‌న్ను జాతీయ నాయ‌కుడిగా ఆమోదించ‌టానికి అంగీక‌రించ‌ర‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.

ప‌ద‌హారు ఎంపీ సీట్ల‌తో ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌నే ఆకాంక్ష‌ను ఇంత‌గా చాటుతున్న కేసీఆర్ కే ఇంత ఉంటే.. 80 మంది ఎంపీలున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. 48 మంది ఎంపీలున్న మ‌హారాష్ట్ర.. 42 ఎంపీలున్న ప‌శ్చిమ‌బెంగాల్.. 39 ఎంపీలున్న త‌మిళ‌నాడులు మ‌రెంత చ‌క్రం తిప్పాల‌నుకోవాలి? చ‌క్రం తిప్పాల‌నుకోవ‌టం త‌ప్పు కాదు. అందుకు అంద‌రిని క‌లుపుకుపోవాల‌న్న ఆలోచ‌న ఉండాలే కానీ. సంప‌న్న బ‌లుపు మాట‌ల్లో రాకూడ‌దు.

తాము ఏటా రూ.ల‌క్ష కోట్లు కేంద్రానికి ప‌న్ను రూపంలో చెల్లిస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌స్తోంది రూ.24 వేల కోట్లు మాత్ర‌మే. మ‌నం ఎక్కువ చెల్లిస్తే.. మ‌న‌కు త‌క్కువ రావ‌టం ఏమిటి? అంటూ వినిపిస్తున్న కేసీఆర్ లాజిక్ వినేందుకు బాగానే ఉంటుంది. కానీ.. ఈ దేశం అన్న యాంగిల్ లో చూసిన‌ప్పుడు.. డ‌బ్బులున్న న‌లుగురు ఆసాములు సంక్షేమం మొత్తం త‌మ‌కే కావాలంటే మిగిలినోళ్లు ఏమైపోవాలి? ఈ దేశం ఏమైపోవాలి? అందుకే.. ఈ త‌ర‌హా మాట‌ల్ని మొద‌టే అడ్డుక‌ట్ట వేయాలి. లేకుంటే. ఈ దేశం అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.