Begin typing your search above and press return to search.

స‌చివాల‌యం కూల్చివేత చెర‌గ‌ని మ‌చ్చ‌లా మిగులుతుందా?

By:  Tupaki Desk   |   16 Jun 2019 5:25 AM GMT
స‌చివాల‌యం కూల్చివేత చెర‌గ‌ని మ‌చ్చ‌లా మిగులుతుందా?
X
సానుకూలంగా ఉన్న పరిస్థితిని ప్ర‌తికూలంగా మార్చుకోవ‌టం కొంద‌రి తెలివికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. త‌మ‌కు తిరుగులేద‌ని.. తాము చేసే ప‌నిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే పాల‌కులంతా త‌ర్వాతి కాలంలో తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చేతిలో ఉన్న అధికారంలో ఏమైనా చేయొచ్చ‌న్న తీరుతో అప్ప‌టిక‌ప్పుడు న‌ష్టం వాటిల్ల‌కున్నా.. త‌ర్వాతి కాలంలో అదో శాపంగా మారుతుంద‌న్న విష‌యాన్ని పాల‌కులు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న త‌ప్పులు రానున్న రోజుల్లో ఆయ‌న‌కు ఇబ్బందిగా మార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ స‌మాజంలో రాజ‌కీయంగా కేసీఆర్ కు తిరుగులేదు. ఆయ‌న్ను కొట్టే నేత యావ‌త్ తెలంగాణ‌లో క‌నిపించ‌రు. అలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు మ‌రింత ఒద్దిక‌గా.. ప‌ద్ద‌తిగా వ్య‌వ‌హ‌రిస్తే.. తిరుగే ఉండ‌దు. కానీ.. ప‌వ‌ర్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న ప‌నులు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టేలా.. వేలెత్తి చూపించేలా మారాయి.

ఓప‌క్క ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు హాట్ టాపిక్ గా మారి.. జ‌గ‌న్ ను చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతున్న వేళ‌.. ఆయ‌న తాజాగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బంగారం లాంటి స‌చివాల‌యాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న కూల్చి వేసి.. ఆ స్థానంలో కొత్త స‌చివాల‌యాన్ని క‌ట్టాల‌న్న నిర్ణ‌యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తు మీద న‌మ్మ‌కం ఉన్నంత‌వ‌ర‌కు ఓకే కానీ.. అదో పిచ్చిలా మారిపోయి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చేస్తాన‌న్న సంకేతాలు ఇస్తున్న వైనం ప‌లువురి జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తెలంగాణ లాంటి సామాజిక చైత‌న్యం ఎక్కువ‌గా ఉండే చోట పాల‌కులు త‌ప్ప‌లు చేస్తే.. ఎంత‌టి బ‌ల‌వంతుడికైనా ఎదురు తిరిగే స‌త్తా తెలంగాణ స‌మాజానికి ఉంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ మ‌ర్చిపోతున్నారు. దాదాపు మ‌రో వందేళ్లు ప‌ని చేసే స‌త్తా ఉన్న స‌చివాల‌యాన్ని తాను ఎందుకు కూల్చి వేసి.. కొత్త‌ది క‌ట్టాల‌ని అనుకుంటున్నాన్న విష‌యానికి ఇప్ప‌టివ‌ర‌కూ వివ‌ర‌ణ ఇచ్చింది లేదు.

ఏక‌ప‌క్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణ‌యం కార‌ణంగా వంద‌లాది కోట్ల ఖ‌ర్చు.. ప్ర‌జాధ‌నం వృధా కావ‌టం ఖాయం. ఈ విష‌యంపై విప‌క్షం ఇప్ప‌టికే తీవ్రంగా అభ్యంత‌రం చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ తాను అనుకున్న‌ది చేసేందుకు ఫిక్స్ అయిన కేసీఆర్ కు షాకిచ్చేందుకు విపక్షాలు రెఢీ అవుతున్నాయి. స‌చివాల‌యం కూల్చివేత‌ను త‌ప్పు ప‌డుతూ కోర్టుకు వెళ్ల‌టం లాంటివి అందులో భాగ‌మే. అదే జ‌రిగి.. కోర్టు నుంచి ప్ర‌తికూల నిర్ణ‌యం వ‌స్తే.. కేసీఆర్ కు అది భారీ ఎదురుదెబ్బ‌గా మారుతుంది. చ‌క్క‌గా సాగుతున్న దానికి చేజేతులారా నాశ‌నం చేసుకోవ‌టం అంటే ఇదేనేమో?