Begin typing your search above and press return to search.

త‌న క‌ల‌ల‌కు తానే బ్రేక్ వేసుకుంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   10 March 2018 6:19 AM GMT
త‌న క‌ల‌ల‌కు తానే బ్రేక్ వేసుకుంటున్న కేసీఆర్‌
X
ఔను. ఇదే మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న క‌ల‌ల‌కు తానే బ్రేక్ వేసుకుంటున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న దూకుడుతో కేసీఆర్ త‌న ముఖ్య‌మంత్రి ల‌క్ష్యానికి ఫుల్ స్టాప్ ప‌డేలా చేసుకున్నార‌ని అంటున్నారు. ఇదంతా కొత్త స‌చివాల‌యం నిర్మాణం గురించి. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైన భవనాన్ని సచివాలయం కోసం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనేక మార్లు ప్రకటించారు. పోలోబైసన్‌ గ్రౌండ్‌ పేరుతో ఉన్న 36 ఎకరాల స్థలంలో దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ భవనాలను నిర్మించటానికి రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. అయితే కొత్త సచివాలయం నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తున్నది. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్‌ లోని పోలో బైసన్‌ గ్రౌండ్‌ అప్పగింతలో జరుగుతున్న జాప్యమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

వాస్తు కార‌ణాల వ‌ల్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌చివాల‌యాన్ని మార్చేందుకు సిద్ధ‌మయ్యారు. రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మించాలని తలపెట్టిన ముఖ్యమంత్రి బైసన్‌ పోలో గ్రౌండ్‌ - జింఖానా గ్రౌండ్‌ లో దీని నిర్మాణం కోసం 2015లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. మనోహరి పారికర్‌ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కొంత ముందడుగు పడింది. కేవలం పోలో బైసన్‌ గ్రౌండ్‌ ఉన్న 36 ఎకరాల స్థలం సచివాలయానికి సరిపోతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని మాత్రమే కేటాయించాలని కేంద్రాన్ని రెండవసారి కోరింది. ఈ స్ఠలానికి సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని రక్షణ శాఖలోని డిఫెన్స్‌ ఎస్టేట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ను కోరారు. దీనిపై ఈ స్థలం వివరాలను - సికింద్రాబాద్‌ ప్రాంతంలోని భూమి మార్కెట్‌ విలువను కూడా డిఫెన్స్‌ సర్కిల్‌ కార్యాలయం కేంద్రానికి పంపింది. ఈ స్థలం విలువ దాదాపు రూ. 600 కోట్ల వరకూ ఉంటుందని డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్కిల్‌ కార్యాలయం కేంద్ర కార్యాలయానికి తెలిపింది. భూమి మార్కెట్‌ ధరకు బదులు భూమికి భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

గత సంవత్సరం ఏప్రిల్‌ - ఆగస్టు నెలల్లో ప్రధాన మంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. బైసన్ పోలో గ్రౌండ్‌ కేటాయించటానికి ప్రధాన మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. గత సంవత్సరం దసరా రోజునే సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కూడా ఆయన అనుకున్నారు. గ్రౌండ్‌ కేటాయించటానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కేంద్ర రక్షణ శాఖ విధివిధానాలు - సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించటంలో తీవ్ర జాప్యం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల చేసిన తీవ్ర విమర్శల నేపధ్యంలో పోలో బైసన్‌ గ్రౌండ్‌ అప్పగిస్తారా లేదా అనే సంశయం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‌ అప్పగింతలో మరింత జాప్యం జరిగితే 2019 ఎన్నికల తర్వాతే కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సీఎం తన సన్నిహితులతో అన్నట్టు స‌మాచారం.