Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని కావాల‌ని కేసీఆర్‌ ను కోరితే ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   27 Feb 2018 7:45 AM GMT
ప్ర‌ధాని కావాల‌ని కేసీఆర్‌ ను కోరితే ఏమ‌న్నారంటే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌ధాని పీఠంపై క‌న్నేశారా? ఆయ‌న పీఏం కావాల‌ని అనుకుంటున్నారా? అయితే మోడీతో పంచాయ‌తీ ఎందుకనే భావ‌న‌లో ఉన్నారా? అంటే దానికి కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. . రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు సోమవారం కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో మాట్లాడిన సీఎం.. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశంలోనూ - సమైక్య రాష్ట్రంలోనూ రైతులకు జరిగిన అన్యాయాలపై నిప్పులు చెరిగారు. దేశంలో అన్నదాతల ఆత్మహత్యలకు - వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడానికి గత కాంగ్రెస్ - ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా మెట్‌ పల్లికి చెందిన ప్రతాప్‌ రెడ్డి అనే రైతు సభలో సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి `సార్ ఆనాడు నక్సలైట్లు రైతు సంఘాలు ఏర్పాటు చేశారు. ఇపుడు మీరు చేస్తున్నారు.. మీ ఆలోచనలకు అచ్చం నక్సలైట్ల లెక్కనే ఉన్నయ్ సారు.. మీరు ప్రధాని అయితే దేశం బాగుపడ్తది` అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వేదికపై ఉన్న ఎంపీ బాల్కసుమన్ సహా పలువురు ఎమ్మెల్యేలు నిల్చొని చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ముసిముసిగా నవ్వుతూ `నన్ను నక్సలైటును చేసినావయ్య - రేప్పొద్దుగాల ఇదో గొడువైతది. మళ్ల మోడీతోని పంచాయితీ పెట్టిస్తవా ఏంది!` అంటూ చలోక్తిగా అన్నారు. సభ ఆద్యంతం సరదా మాటలతో సాగింది. సభ్యులను సీఎం కేసీఆర్ నవ్విస్తూ ఆకట్టుకున్నారు.

కాగా, తన ప్రసంగంలో కేసీఆర్ సెటైర్లు వేశారు. `మీకు అధికారులు పుస్తకాలు ఇచ్చారు. వాటిని ఇంటికి తీస్కపోయి అటక మీద ఏసేరు.. బాగా చదువుకుని రైతులకు చెప్పాలి` అని అనడంతో సభలో నవ్వు లు వినిపించాయి. కాంగ్రెస్ - బీజేపీల ప్రస్తావన వచ్చినపుడు `ఢాంఢూమ్మని డైలాగులు చెప్పి రైతుల కోసం అది చేస్తున్నం. ఇది చేస్తున్నమని చెప్పితే కండ్లకు చెక్కరచ్చేది`అని నవ్వులు పూయించారు. `సంఘటితం అంటే ఎర్కేనా మీకు.. ఒక్క ఏలుతోని కొడితే దెబ్బ తాకుతదా.. అదే పిడికిలి బిగించి కొట్టున్రి.. మొఖం పచ్చడై పోతది. ఇదే సంఘటితం అంటే` అని రైతు సమన్వయ సమితుల ఐక్యతపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య సభను ఆకట్టుకున్నాయి. సీఎం ఉద్వేగంతో మాట్లాడుతున్నపుడు సభలో సభ్యులు ఈలలు వేస్తూ హర్షం తెలిపారు. సీఎం వారిని వారిస్తూ.. అరే సీటీలు కొట్టకుండ్రయ్యా.. రైతుల సమస్యలు పరిష్కరించినపుడు అందరం సంబురాలు చేసుకుందాం అని చెప్పారు.