Begin typing your search above and press return to search.

ఒక‌టి ఇంటికి.. రెండు బీటీ బ్యాచ్ కా?

By:  Tupaki Desk   |   12 March 2018 4:18 AM GMT
ఒక‌టి ఇంటికి.. రెండు బీటీ బ్యాచ్ కా?
X
రాజ్య‌స‌భ బెర్తులు ఎవ‌రికి ద‌క్క‌నున్నాయ‌న్న ఆస‌క్తి టీఆర్ఎస్ పార్టీతో పాటు.. తెలంగాణ మొత్తంలోనూ వ్య‌క్త‌మైంది. విడిగా నీతులు ఎన్ని చెప్పినా.. ఇంట్లో వారికి న్యాయం చేసే విష‌యంలో ఎలాంటి లోటు చేయ‌ని కేసీఆర్‌.. తాజా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ అదే విధానాన్ని పాటించారు. త‌న‌కు ద‌గ్గ‌ర బంధువు.. త‌మ కుటుంబ మీడియా సంస్థ‌ల్లో కీల‌క స్థానాన్ని పోషించే న‌మ్మిన‌బంటు క‌మ్ త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎంతో సేవ చేసిన సంతోష్‌కు రాజ్య‌స‌భ సీటును క‌ట్ట‌బెట్టేందుకు ఏ మాత్రం సందేహించ‌లేదు.

న‌మ్మినోళ్ల‌కు.. న‌మ్ముకున్నోళ్ల‌కు తాను హ్యాండ్ ఇవ్వ‌నున్న విష‌యాన్ని సంతోష్ విష‌యంలో మ‌రోసారి రుజువు చేశారు కేసీఆర్. అయితే.. ఇలాంటి వైఖ‌రంతా కుటుంబ స‌భ్యుల విష‌యంలోనే జ‌రుగుతుంద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసే అభ్య‌ర్థుల విష‌యంలో సంతోష్ పేరును ముందే ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. మిగిలిన రెండు స్థానాల విష‌యంలో మాత్రం త‌న తుది నిర్ణ‌యాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించే వ‌ర‌కూ బ‌య‌ట‌కు పొక్క‌క‌పోవ‌టం చూస్తే.. కేసీఆర్ ఎంత గుట్టుగా వ్య‌వ‌హ‌రాన్ని న‌డిపించార‌ని చెప్పాలి.

రాజ్య‌స‌భ‌కు పంపే నేత‌ల విష‌యంలో పార్టీలో సాగిన ప్ర‌చారానికి భిన్నంగా కేసీఆర్ ప్ర‌క‌టించిన రెండు పేర్లు ఉన్నాయ‌ని చెప్పాలి. అన్నింటికంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాజాగా రెండు రాజ్య‌స‌భ స్థానాల్ని త‌న పార్టీలోని బంగారు తెలంగాణ బ్యాచ్‌.. అదేనండి బీటీ బ్యాచ్‌ కి కేటాయించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఉద్య‌మ వేళ నుంచి త‌న‌తో న‌డిచిన వారి కంటే.. ప‌వ‌ర్లోకి వ‌చ్చాక పార్టీలోకి వ‌చ్చిన బీటీ బ్యాచ్ ప‌ట్ల కేసీఆర్ మ‌మ‌కారాన్ని ప్ర‌ద‌ర్శిస్తార‌న్న ఆరోప‌ణ ఉంది.

దీన్ని బ‌ల‌ప‌రిచేలా ఇప్ప‌టికే ప‌లు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. తాజాగా రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల విష‌యంలో ఇది మ‌రోసారి రుజువైంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. బీసీల‌కు పెద్ద‌పీట వేసిన‌ట్లుగా.. రెండు స్థానాల్ని ఆ వ‌ర్గానికే కేటాయించ‌టం ద్వారా.. బీసీల‌కు తానిచ్చే ప్రాధాన్య‌త‌ను కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. మొత్తం మూడు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి ఇంటికి.. రెండు బీటీ బ్యాచ్ కి ఇచ్చేసిన కేసీఆర్‌.. మొద‌ట్నించి పార్టీలో ఉన్న వారికి ఇవ్వ‌క‌పోవ‌టంపై పార్టీలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌టం లేదు.

నేత‌ల అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో.. త‌మ‌కు బాగా న‌మ్మ‌కమున్న మీడియా మిత్రుల వ‌ద్ద త‌మ ఆవేద‌న‌ను.. ఆక్రోశాన్ని వ్య‌క్తం చేస్తున్నారు గులాబీ నేత‌లు. ద‌గ్గ‌రి బంధువైన సంతోష్‌ కు ప‌ద‌విని ఇచ్చిన విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రాలు లేవు. సొంతోళ్ల‌కు ఆ మాత్రం చేసుకోకుండా ఉంటారా? అన్న మాట‌తో పాటు.. సంతోష్ కాబ‌ట్టి ఫ‌ర్లేద‌న్న మాట వారి నోటి నుంచి వ‌స్తోంది.

మిగిలిన రెండు స్థానాల విష‌యంలో మాత్రం పార్టీలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు బెర్తుల్ని బీటీ బ్యాచ్‌ కి ఇవ్వ‌టంపైనే గులాబీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. బండా ప్ర‌కాష్ అయితే పార్టీలోకి వ‌చ్చి ఏడాది మాత్ర‌మే అయ్యింద‌ని.. అప్పుడే అంత ప‌ద‌వి ఎలా ఇచ్చేస్తార‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఇక‌.. మ‌రో అభ్య‌ర్థిగా ఫైన‌ల్ చేసిన బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ సైతం పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాతే వ‌చ్చార‌ని గుర్తు చేస్తున్నారు. ఏమైనా ముందు నుంచి ఉన్న వారి కంటే వెనుక వ‌చ్చిన వారికే పెద్ద‌పీట వేయ‌టం కేసీఆర్‌కు మామూలేన‌ని.. బ‌య‌ట నుంచి వ‌చ్చిన‌ వారికి ప‌ద‌వులు.. మొద‌ట్నించి ఉన్న వారికి పంచ్ లు ఇవ్వ‌టం తమ అధినేత‌కు అల‌వాటేన‌ని.. ఈసారి అదే జ‌రిగింద‌న్న నిట్టూర్పును విడుస్తున్నారు.