Begin typing your search above and press return to search.

తాను ఓటు వేసే టైం కేసీఆర్ ఎందుకు చెప్పారు?

By:  Tupaki Desk   |   23 March 2018 3:21 AM GMT
తాను ఓటు వేసే టైం కేసీఆర్ ఎందుకు చెప్పారు?
X
రాష్ట్రంలో త‌న‌కు తిరుగు లేద‌ని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పార్టీ మీద ప‌ట్టు లేదా? అంటే.. ఉంద‌నే చెబుతారు. అస‌లు ఆ అనుమానం ఎందుకు వ‌చ్చింద‌ని ఎదురుప్ర‌శ్న వేస్తారు. కానీ.. తాజాగా కేసీఆర్ మాట‌లు చెబితే.. త‌న చుట్టూ ఉన్న వారి విష‌యంలో ఆయ‌న‌కు కొన్ని అనుమానాలు ఉన్న విష‌యం ఇట్టే అర్థంకాక మాన‌దు. ఈ రోజు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ ఈ రోజు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో న‌మూనా పోలింగ్ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ భ‌వ‌న్ లో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేసిన కేసీఆర్‌.. ప‌నిలో ప‌నిగా తాను (శుక్ర‌వారం) ఉద‌యం 9 గంట‌ల‌కు ఓటు వేయ‌టానికి వ‌స్తున్న‌ట్లుగా చెప్పారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌టానికి 30 ఓట్లు త‌ప్ప‌నిస‌రి. ఇలాంటివేళ‌.. కాంగ్రెస్‌ కు 17 ఓట్లు మాత్ర‌మే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో ఉంచారు.

బ‌లం లేకున్నా.. అభ్య‌ర్థిని ఎందుకు ఉంచిన‌ట్లు అంటూ కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. క‌నీసం సోయి లేదంటూ వ్యాఖ్యానించారు. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసినా అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌టం ఎందుక‌న్న ఆయ‌న‌.. కావాల‌నే అలా చేస్తున్నార‌ని.. రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ముగ్గురు అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

ఇప్పుడున్న బ‌లం ప్ర‌కారం.. ముగ్గురు టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు గెల‌వ‌టం ఖాయ‌మే అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ కు ఎంత‌కంత ఆగ్ర‌హం అంటే కార‌ణం లేక‌పోలేదు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎవ‌రైనా పార్టీ నేత‌లు త‌మ ఓటు విష‌యంలో తేడా చేస్తే కొత్త త‌ల‌నొప్పి. అంతేనా.. ఎవ‌రైనా ఓటు వేసే విష‌యంలో పొర‌పాటు చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అదే.. కాంగ్రెస్ కానీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌ప‌ని ప‌క్షంలో.. ఈ త‌ల‌నొప్పులు ఉండేవి కావు. గెలిచే అవ‌కాశం లేన‌ప్ప‌టికీ.. అధికార‌పార్టీని ఇరుకున పెట్టే ఏ చిన్న ఛాన్స్ ను వ‌దిలిపెట్ట‌ని కాంగ్రెస్ తీరు.. కేసీఆర్ లాంటి అధినేత‌కు అస‌హ‌నం క‌లిగించింది.

ఇందుకు నిద‌ర్శ‌నంగా ఆయ‌న మాట‌ల్ని ఇక్క‌డ ప్ర‌స్తావించాలి. ఏ రాష్ట్రంలో అయినా రాజ‌కీయ పార్టీలు త‌మ బ‌లాన్ని చూసుకొని.. అందుకు త‌గ్గ‌ట్లు అభ్య‌ర్థుల్ని బ‌రిలో నిలిపాయ‌ని.. బాగా వైరం ఉన్న ఏపీలోనూ టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ త‌మ‌కున్న బ‌లాల‌కు త‌గ్గ‌ట్లు అభ్య‌ర్థుల్ని బ‌రిలో నిలిపి.. ఏక‌గ్రీవం చేసుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉద‌యం 9 గంట‌ల‌కే ఓటు వేసేందుకు తాను అసెంబ్లీకి వ‌స్తాన‌ని కేసీఆర్ చెప్ప‌టం ఎందుక‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. పోలింగ్ వేళ‌.. పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారుగా ఉండి.. ఆల‌స్యంగా వ‌స్తే.. హైరానా ప‌డాల్సిన భారం అధికార‌ప‌క్షం మీద‌నే ఉంటుంది. అందుకే.. అలాంటి ప‌రిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. తాను ఉద‌య‌మే వ‌స్తున్నాన‌ని చెబితే.. మిగిలిన నేత‌లంతా ఆ టైంకే ఉండాల‌న్న విష‌యం చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లు అవుతుంది. ఈ కార‌ణంతోనే సీఎం కేసీఆర్ తాను ఓటు వేసే టైంను ముందే చెప్పేసుకున్నార‌ని చెప్పాలి.