Begin typing your search above and press return to search.

కేసీఆర్ వెన‌క్కి తగ్గారు బాస్‌!

By:  Tupaki Desk   |   10 Jun 2018 4:40 AM GMT
కేసీఆర్ వెన‌క్కి  తగ్గారు బాస్‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నిండా ప‌ది నెల‌లు కూడా లేని వేళ‌లో.. ఆర్టీసీ కార్మికులు చేస్తాన‌ని చెబుతున్న స‌మ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రియాక్ట్ అయిన తీరు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. పెనురాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది. ఇటీవ‌ల కాలంలో ఏ రాజ‌కీయ నేత కూడా ఇంత‌ బోల్డ్ గా మాట్లాడ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌మ్మె చేస్తారా? ఒక‌వేళ చేస్తే. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇదే చివ‌రి స‌మ్మె అవుతుంది. సంస్థ‌ను మూసేస్తామంటూ కేసీఆర్ ఆగ్ర‌హంతో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆర్టీసీ ఉద్యోగులు అంత‌కు రెట్టింపు ఆగ్ర‌హంతో వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

దీంతో.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల‌లో కీల‌క‌మైన వాటిల్లో ఒక‌టైన ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్‌)ను కార్మికులు కోరిన దానికి కాస్త అటుఇటుగా ఓకే చేయాల‌న్న‌ట్లుగా కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు అంటేనే మండిప‌డుతున్న కేసీఆర్.. స‌మ్మె మాట వింటేనే శివాలెత్తి పోతున్నారు. ముందు స‌మ్మె ఆలోచ‌న ప‌క్క‌న పెట్టి ప‌ని చూసుకోవాల‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అమీతుమీ తేల్చుకోవాల‌న్న‌ట్లుగా వారి తీరు ఉండ‌టం.. కేసీఆర్ పై పోరాటానికి వారు రెఢీ అయ్యార‌న్న మాట వినిపించింది.

ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ప‌ట్టుద‌ల‌కు పోతే.. త‌మ‌కే న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని అధినేత‌కు ఆయ‌న స్నిహితులు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల‌కు ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేసిన నేప‌థ్యంలో.. వారు కోరిన‌వ‌న్నీకాకున్నా.. వారి కోరిక‌ల్లో ఒక దానినైనా కొంత‌మేర‌కు తీర్చ‌టం ద్వారా ఆర్టీసీ వ్య‌వ‌హారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

శ‌నివారం నాన్ స్టాప్ గా చ‌ర్చ‌లు సాగి.. ఐఆర్ మీద ఇరు వ‌ర్గాలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ చ‌ర్చ‌ల్లో జ‌రిపిన మథ‌నాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇష్యూ క్లోజ్ చేయొచ్చ‌ని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తే.. దాన్ని విఫ‌లం చేయ‌టం ప్ర‌భుత్వ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని.. అయిన‌ప్ప‌టికీ మొండిగా చేస్తే.. లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అవుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇదే విష‌యాన్ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన రివ్యూలో ప‌రోక్షంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అన్ని సంఘాలు స‌మ్మెకు దిగ‌టం.. ఎవ‌రూ ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లుగా వినేందుకు సుముఖంగా ఉండ‌టంతో స‌మ్మె జ‌రిగితే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే కేసీఆర్ మైండ్ సెట్ ను కాస్త మార్చేలా చేసిన‌ట్లు చెబుతున్నారు. ఐఆర్ పై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందిస్తే.. స‌మ్మె వ్య‌వ‌హారం టీ క‌ప్పులో తుఫానుగా మారి ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రి.. తాజా ప్ర‌తిపాద‌న‌పై కార్మిక సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగుల స‌మ్మె విష‌యంలో సీఎం కేసీఆర్ మ‌రింత సానుకూలంగా ఉంటారా? లేదా? అన్న‌ది ఈ రోజు (ఆదివారం) తేల‌నుంది.