Begin typing your search above and press return to search.

రమ్మని చెప్పి పట్టించుకోని కేసీఆర్!

By:  Tupaki Desk   |   11 Sep 2019 1:30 AM GMT
రమ్మని చెప్పి పట్టించుకోని కేసీఆర్!
X
పాపం ఆయన మటుకు ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉంటూ తన మానాన తను సైలెంట్ గా ఉండేవాడు.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోవడంతో కాంగ్రెస్ జెండానే నమ్ముకొని ఉన్నాడు. అలాంటి నేతను రా రామ్మని పిలిచి టీఆర్ఎస్ లో చేర్చుకొని ఇప్పుడు కేసీఆర్ పట్టించుకోకపోవడం ఆ నేతనూ - ఆయన అనుచరులను తీవ్రంగా అసంతృప్తికి గురిచేస్తోందట.. అదే జిల్లాకు చెందిన మరో నేతదీ అదే పరిస్థితి..

నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు కేఆర్ సురేష్ రెడ్డి - మండవ వెంకటేశ్వరరావు.. కాంగ్రెస్ - టీడీపీలో ఉన్న వీరిద్దరినీ కేసీఆరే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి గులాబీ దళంలో చేర్చుకున్నారు. సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవి - ఇక మండవకు కార్పొరేషన్ పదవి ఇస్తానని కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చి చేర్చుకున్నారు.

కానీ నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమితో వీరి కలలు కల్లలయ్యాయి. కేసీఆర్ నిజామాబాద్ జిల్లాను - నేతలను అస్సలు పట్టించుకోవడం లేదట.. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణ చేసిన కేసీఆర్ ఇప్పుడు కార్పొరేషన్ పదవులపై దృష్టిపెట్టారట.. అయితే కేసీఆర్ మదిలో కేఆర్ సురేష్ రెడ్డి - మండవ వెంకటేశ్వర్లకు పదవులపై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం వారిని కలవరపరుస్తోంది.

ఇక సురేష్ రెడ్డిని రాజ్యసభకు పంపే విషయంపై కూడా కేసీఆర్ స్పందించకపోవడం.. మౌనంగా ఉండడంతో ఆయన వర్గం రగిలిపోతోంది. అనవసరంగా టీఆర్ఎస్ లోకి వచ్చామా అని ఇప్పుడు కేఆర్ సురేష్ రెడ్డి - మండవల వర్గం రగిలిపోతోందట.. మాట తప్పిన కేసీఆర్ తీరుపై వారంతా గుర్రుగా ఉన్నారట.. ఇక కేఆర్ సురేష్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది.