Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తాల్లేవ్‌!

By:  Tupaki Desk   |   20 Dec 2018 8:37 AM GMT
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తాల్లేవ్‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ‌. ఆయ‌న చేయించిన‌ యాగాలు - దేవ‌త‌ల‌కు మొక్కుల చెల్లింపులు - తెలంగాణలో ఆల‌యాల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్య‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇక ముహూర్తాల‌కు కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఏం చేసినా ముహూర్త బ‌లం ఉండేలా చూసుకుంటారు. అసెంబ్లీ ర‌ద్దు విష‌యంలోనూ ఆయ‌న ముహూర్తం చూసుకునే ప‌ని కానిచ్చేశార‌ని ప‌లువురు చెబుతుంటారు.

ముహూర్తాల‌పై కేసీఆర్ కు ఉన్న ఈ విశ్వాస‌మే ఇప్పుడు ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఆల‌స్యానికి కార‌ణ‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల‌లోగానీ జ‌న‌వ‌రిలోగానీ కేబినెట్ ఏర్పాటు ఉండ‌క‌పోవ‌చ్చున‌ని.. ఫిబ్ర‌వ‌రిలోనే కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయొచ్చున‌ని తెలుస్తోంది.

కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్ర‌మాణం చేసిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు మ‌హ‌బూబ్ అలీ మాత్ర‌మే హోంమంత్రిగా ప్ర‌మాణం చేశారు. ఆపై 2-3 రోజుల్లో మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించొచ్చ‌ని అంతా భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇంత‌వ‌రకు విస్త‌ర‌ణ చోటుచేసుకోలేదు. నిజానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ తాపీగా కనిపిస్తున్నారు. మంత్రివర్గ ఏర్పాటు గురించి ఆయన కసరత్తు చేస్తున్న దాఖలాలు పెద్ద‌గా కనిపించడం లేదు.

ఇక రాబోయే ప‌ది రోజులు కేసీఆర్ ఇత‌ర ప‌నుల్లో బిజీగా ఉండ‌నున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉండే మూడు రోజులూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఆయ‌న దిల్లీ వెళ్తారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీని మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లుస్తారు.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. జ‌న‌వ‌రి 4వ తేదీ త‌ర్వాత మంచి ముహూర్తాల్లేవు. ఆ లోపే కేసీఆర్ వేరే ప‌నుల‌తో బిజీగా ఉంటారు. కాబ‌ట్టి వ‌చ్చే నెల 4లోపు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ క‌ష్టం. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలోగానీ మంచి ముహూర్తాలు రావు. ముహూర్తం బాగా లేన‌ప్పుడు మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటుచేసేందుకు కేసీఆర్ మొగ్గుచూపే అవ‌కాశాలు లేనే లేవు. కాబట్టి ఇక కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగేది ఫిబ్ర‌వ‌రిలోనేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.