Begin typing your search above and press return to search.

మంత్రివర్గానికి మరికొంత సమయం

By:  Tupaki Desk   |   4 Jan 2019 5:47 AM GMT
మంత్రివర్గానికి మరికొంత సమయం
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు - హోం మంత్రిగా మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరు మినహా తెలంగాణలో ప్రభుత్వమే లేకుండా పోయింది. కొత్త సంవత్సరంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ముందుగా ఆరు నుంచి ఎనిమిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ వార్తలూ వచ్చాయి. లోక్‌ సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్ధాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. ఒక్క లోక్‌ సభ ఎన్నికలు మినహా మిగిలిన అన్ని తేదీలు - వారాలు గడిచిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రం ఓ కొలిక్కి రాలేదు. దీనిపై అధికార పార్టీ కూడా ఎలాంటి స్పందన చూపించడం లేదు. జనవరి మొదటి వారం అనుకున్న మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికలు బ్రేక్ వేశాయి. ఈ ఎన్నికలకు కేవలం 20 రోజులే గడువు ఉండడంతో - ఇప్పుడు మంత్రివర్గ విస్తరణతో తలనొప్పులు ఎందుకని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

పంచాయతీ ఎన్నికల ప్రకటనతోనే కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఇది కూడా మంత్రివర్గ విస్తరణకు అడ్డంకిగానే ఉంది. పోనీ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకుంటే అది కూడా సాధ్యం అయ్యేలా లేదు. దీనికి కారణం ఫిబ్రవరి రెండో వారంలో సహకార ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే మళ్లీ కోడ్ అమలు లోకి వస్తుంది. అప్పుడు మళ్లీ మంత్రివర్గ విస్తరణకు అవకాశాలుండవు. ఇక ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో లోక్‌ సభకు - కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి.దీని కోసం ఫిబ్రవరి మూడో వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్ జారీ చేయనుంది. అదే జరిగితే మళ్లీ లోక్‌ సభ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేవంటున్నారు. అంటే మరో ఐదు నెలల వరకూ తెలంగాణలో పూర్తి స్ధాయి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకూ ముఖ్యమంత్రి - హోం మంత్రి మాత్రమే తెలంగాణలో పాలన సాగిస్తారు. హోం మంత్రి మహమూద్ ఆలీకి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని పార్టీలో ప్రతి ఒక్కరు చెబుతున్నారు.దీంతో అటు హోం శాఖకు చెందిన నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావే తీసుకుంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే తెలంగాణలో ఇక ఏకఛత్రాధిపత్య పాలన కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి.