Begin typing your search above and press return to search.

రైతుల కోసం కేసీఆర్ రికార్డ్..కానీ దీని సంగ‌తేంటో?

By:  Tupaki Desk   |   7 Nov 2017 1:30 AM GMT
రైతుల కోసం కేసీఆర్ రికార్డ్..కానీ దీని సంగ‌తేంటో?
X
తెలంగాణ రైతన్నలకు మరో శుభవార్త. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు విద్యుత్ అధికారులను ఆదేశించారు. దీంతో మరో అయిదారు నెలల్లో వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు తొలి అడుగు వేశారు.దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నప్పటికీ.. ఎక్కడా 24 గంటలపాటు సైప్లె లేదు. నిరాటంకంగా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ నివ్వడం సరికొత్త రికార్డుగా చరిత్రలో నిలిచిపోనుంది.

అయితే ఇదంతా నాణానికి ఒక‌వైపేన‌ని...మ‌రోవైపు ఆస‌క్తిక‌రమైన మ‌లుపు ఉంద‌ని రైతాంగంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు చెప్తున్నారు. అదే మ‌ద్ద‌తు ధ‌ర‌. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌రువై రైతులు తీవ్ర అవ‌స్థ‌ల్లో ఉన్నారు. పంట‌ను తెగ‌న‌మ్ముకునే ప‌రిస్థితి నెల‌కొని ఉంది. ఆరుగాలం శ్ర‌మించిన రైత‌న్న త‌న పంట‌కు క‌నీసం ధ‌ర రాక దిగాలుతో వాటిని ద‌గ్దం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో పంట‌ను పండించేందుకు అన్ని సౌల‌భ్యాలు క‌ల్పిస్తున్నప్ప‌టికీ పండించిన వాటికి ధ‌ర రాక‌పోతే...ప్ర‌యోజ‌నం ఏమిట‌ని అన్న‌దాత‌ల నుంచి స‌హ‌జంగానే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు అధికార టీఆర్ ఎస్ పార్టీ - తెలంగాణ ప్ర‌భుత్వం ఏం స‌మాధానం ఇస్తుందో మ‌రి!

ఇదిలాఉండ‌గా...తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 23 లక్షలకు పైగా పంపుసెట్లున్నాయి. ఇప్ప‌టికే నిరంతరం ఉచిత విద్యుత్ అమలవుతున్న మూడు జిల్లాల పరిధిలో 9.58లక్షల పంపుసెట్లున్నాయి. రాష్ట్రంలోని పంపుసెట్లలో ఇవి 43శాతం. గరిష్ఠంగా 9,500 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే, చాలినంత విద్యుత్ సమకూర్చుకుని ఈ మూడు జిల్లాలకు అందించగలిగారు. వచ్చే మార్చి నుంచి మిగతా అన్ని జిల్లాల్లో 23 లక్షలకు పైగా ఉన్న పంపుసెట్లకు నిరంతర విద్యుత్‌ ను ఇవ్వడం వల్ల మరో 1500-2000 మెగావాట్ల మేర డిమాండ్ అదనంగా రావచ్చు. ఈ డిమాండ్‌ ను సైతం అందుకోవడానికి విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.