Begin typing your search above and press return to search.

రెండు ల‌క్ష‌ల కోట్లు..కేసీఆర్ బ‌డ్జెట్ ఇది

By:  Tupaki Desk   |   31 Jan 2019 1:02 PM GMT
రెండు ల‌క్ష‌ల కోట్లు..కేసీఆర్ బ‌డ్జెట్ ఇది
X
గులాబీ ద‌ళప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యాల్లో ఎలా ఉంటుంద‌నేందుకు ఇదో నిద‌ర్శ‌నం. కీల‌క నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న కేసీఆర్ త‌న ప్ర‌భుత్వ మ‌ధ్యంత‌ర బడ్జెట్ గురించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర సొంత రాబడులు - పన్నేతర ఆదాయం బాగా పెరుగుతుండటంతో ఏటా బడ్జెట్‌ ను పెంచుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడిలో 19 శాతం వృద్ధిరేటు నమోదైంది. దీంతో బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ రూ.రెండు లక్షల కోట్లు దాటొచ్చని అంచనా.

ఫిబ్రవరి రెండు లేదా మూడోవారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ను చట్టసభల్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ను చూసి - దానికి అనుగుణంగా రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవలి సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు శాఖల వారీగా బడ్జెట్‌ పై కసరత్తును వేగవంతం చేశారు. పేరుకు తాత్కాలిక బడ్జెటే అయినా పూర్తిస్థాయిలో అన్ని వివరాలతో తుదిరూపం ఇస్తున్నారు. నాలుగేళ్లుగా ఏటా సొంత రాబడి కనీసం 19 శాతం చొప్పున పెరుగుతున్నది. 2017-18లో రాబడి వృద్ధిరేటు 17శాతం దాటింది. అంతకుముందు ఏడాది రూ.1.5 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ ను 2018-19లో రూ.1.74 లక్షల కోట్లకు పెంచారు. ఈసారి రాబడి వృద్ధిరేటు 19శాతం దాటడంతో బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటొచ్చని అధికారులు చెప్తున్నారు. రెవెన్యూ రాబడులు - ఖర్చులు - క్యాపిటల్ రాబడులు - క్యాపిటల్ ఖర్చులు - ఆస్తులు - అప్పులు ఇలా మొత్తం రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఉంటుందని సమాచారం.

కేంద్రం ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మార్చి మొదటివారంలో లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేలా ఆర్థికశాఖ అధికారులు రంగం సిద్ధంచేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సరిపోయేలా దాదాపు పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ను రూపొందించినా .. ఆరు నెలల కాలానికే అనుమతి తీసుకోనున్నారు. శాసనసభ - శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ పై సాధారణ చర్చ ఉంటుందే తప్ప ప్రతీ పద్దుపై చర్చలు ఉండవని స్పష్టంచేశారు. లోక్‌ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నా ముందు జాగ్రత్తగా ఆరునెలల వరకు అనుమతి తీసుకోనున్నట్టు తెలిపారు.