Begin typing your search above and press return to search.

వంద‌లు కాస్తా వేల‌ల్లోకి..సొల్యూష‌న్ ఏంది సార్‌?

By:  Tupaki Desk   |   11 Jan 2019 6:13 AM GMT
వంద‌లు కాస్తా వేల‌ల్లోకి..సొల్యూష‌న్ ఏంది సార్‌?
X
ముఖ్యమంత్రి సచివాల‌యానికి వెళ్లాలా? ఇదేం మాట‌? అస‌లు ఆ మాట‌లో ఏమైనా అర్థం ఉందా? బ్ర‌ద‌ర్.. ముఖ్య‌మంత్రి అన్నోడు.. ఎక్క‌డ ఉండే అదే సీఎంవో. ఆ మాత్రం తెలీదా? దానికే.. ఏదో అయిపోయిన‌ట్లు భ‌లే మాట్లాడ‌తారే? సీఎంగా ఉన్నోడు ఏం చేయాలో.. ఎక్క‌డికి వెళ్లి ప‌ని చేయాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? అన్న‌ట్లుగా కేసీఆర్ మాట‌లు తెలిసిందే. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌చివాల‌యానికి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు వెళ్ల‌కుండానే ఒక ట‌ర్మ్ (మ‌ధ్యంత‌రాన్ని మిన‌హాయిస్తే)ను పూర్తి చేసి.. రెండోసారి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం తెలిసిందే.

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై నేటికి నెల దాటింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కేసీఆర్.. ఒక్క‌సారి కూడా స‌చివాల‌యం ముఖం చూసింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే హైద‌రాబాద్‌ లో ఉన్న రోజులు కూడా త‌క్కువే. మ‌రిలా.. త‌న‌కు న‌చ్చిన చోట‌.. కోరుకున్న చోటకు వెళుతున్న ఆయ‌న కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు నేరుగా క‌లిగే న‌ష్టం లేదు.. ఇబ్బంది కూడా లేదు.

కాకుంటే స‌మ‌స్య మొత్తం పెండింగ్ ఫైళ్ల‌తోనే. ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్ణ‌యం కార‌ణంగా కీల‌క ఫైళ్లు మొద‌లుకొని.. ముఖ్య‌మైన ఫైళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మంత్రి వ‌ర్గం అన్నా ఉంటే.. కొన్ని ఫైళ్లు వారు క్లియ‌ర్ చేసే వాళ్లు. కానీ.. కేసీఆర్.. మ‌హ‌మూద్ అలీ ఇద్ద‌రే ప్ర‌భుత్వ బాసులుగా ఉండ‌టం.. ఫైళ్ల క్లియ‌రెన్స్ విషయాన్ని కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లు చెబుతున్నారు.

గ‌తంలో మ‌రే ముఖ్య‌మంత్రి హ‌యాంలోనూ లేని రీతిలో పెండింగ్ ఫైళ్ల సంఖ్య పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో వంద‌ల్లో ఉండే పెండింగ్ ఫైళ్లు.. గ‌డిచిన నాలుగైదు నెల‌ల్లో నెల‌కొన్న ప‌రిణామాల‌తో ఇప్పుడు వేల‌ల్లోకి వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. ఇదే తీరు మ‌రికొన్ని నెల‌లు గ‌డిస్తే.. ల‌క్ష అంకెను ట‌చ్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదంటున్నారు.

ఫైళ్ల క్లియ‌రెన్స్ విష‌యంలో కేసీఆర్ తీరు కాస్త భిన్న‌మైన‌ద‌ని చెబుతారు. చివ‌ర‌కు రొటీన్ పోస్టింగ్ ల‌కు సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు క‌దల‌టం లేదంటున్నారు. చాలా ముఖ్య‌మైన ఫైళ్లు.. అది కూడా కొన్ని ప్ర‌త్యేక అంశాలున్న వాటిని మాత్ర‌మే క్లియ‌ర్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. ఏదో జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తున్నా.. అంత‌ర్గతంగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కొని ఉన్న‌ట్లు చెబుతున్నారు. సీఎంవోలో పేరుకు పోతున్న ఫైళ్ల గుట్ట‌ల్ని చూసి అధికారులు కిందామీదా ప‌డుతున్నార‌ని.. ఆ గుట్ట‌లు త‌గ్గాలంటే భారీ డ్రైవ్ అవ‌స‌ర‌మ‌ని అంటున్నారు. మ‌రో నెల‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్లు క్లియ‌ర్ అయ్యేనా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.