Begin typing your search above and press return to search.

ఆయన పిలువరు...ఈయన వెళ్లరు!

By:  Tupaki Desk   |   12 July 2018 8:51 AM GMT
ఆయన పిలువరు...ఈయన వెళ్లరు!
X
మాజీ మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కేంద్రంగా ఒక్క‌సారిగా సాగిన క‌ల‌కలం...అనూహ్య రీతిలో స‌ద్దుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప‌రిణామం ప‌రిష్కారం లేకుండానే జ‌రిగిపోవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల‌నే ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫిర్యాదు చేయడానికి ముందు పార్టీ నేతలు తనతో మాట్లాడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని డీఎస్ వ్యక్తం చేశారు. డీఎస్ అసంతృప్తి నేప‌థ్యంలో కేసీఆర్ ఆయ‌న్ను పిలిచి మాట్లాడతార‌ని భావించారు. కానీ అదీ జ‌ర‌గ‌లేదు. డీఎస్ సైతం స్పందించ‌డం లేదు. దీంతో ‘ఆయన పిలువరు - ఈయన వెళ్లరు’ అన్న చందంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.

డీఎస్‌ పై ఫిర్యాదు నేప‌థ్యంలో ఆయ‌న స్పందించిన తీరు ఈ `గ్యాప్‌` ఏర్ప‌డేందుకు కార‌ణం అంటున్నారు. తాను ఎన్నడూ క్రమ శిక్షణ తప్పలేదని, అలాంటప్పుడు సీఎంకు ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి - ఏమైతుంది? అంటూ డీఎస్ చాలా తేలికగా కొట్టి పడేయడాన్ని టీఆర్ ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకోవడం వల్లనే నేతల ఫిర్యాదు, ఆరోపణలను డీఎస్ ఖాతరు చేయలేదని టీఆర్ ఎస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వస్తే తప్ప వెళ్లకూడదని డీఎస్ భావిస్తుండగా - ఆయనకు అపాయింట్‌ మెంట్ ఇవ్వడానికి కేసీఆర్ కూడా సుముఖంగా లేరని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. తనను కలువాల్సిందిగా సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి పిలుపు రాగానే డీఎస్ స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని టీఆర్ ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని - హైదరాబాద్‌ కు రాగానే కలుస్తానని డీఎస్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే, హైదరాబాద్‌ కు వచ్చాక కూడా సీఎంను కలువకుండా డీఎస్ నేరుగా నిజామాబాద్ వెళ్లి పోయారు. ఈ చర్య కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. ఆ తర్వాతనే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు బాహాటంగా డీఎస్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటానికి కారణంగా భావిస్తున్నారు. ఇదిలావుంటే, టీఆర్ ఎస్‌ కు దూరం కాగానే కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని అనుకున్నారని, కానీ, అక్కడి నుంచి ఇంతవరకు ఎలాంటి పిలుపురాలేదని డీఎస్ సన్నిహిత వర్గాల కథనం. అయితే ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే....టీఆర్ ఎస్‌ లో డీఎస్ క‌థ‌ కంచికి చేరినట్టే కనిపిస్తోంది.