Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ మా నినాదం... తెరాస !

By:  Tupaki Desk   |   23 Sep 2018 3:50 PM GMT
కేసీఆర్‌ మా నినాదం... తెరాస  !
X
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు వ్యూహ - ప్రతివ్యూహలతో తలమునకలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి తెరాసాను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెడుతున్నాయి. అయితే మహాకూటమిని ధీటుగా ఎదుర్కునేందుకు కేసీఆర్ నే ప్రధానంగా చూపించి లబ్ది పొందాలని తెరాస నాయకత్వం యోచిస్తోంది. తెలంగాణ జిల్లాలలోని అభ్యర్దుల పట్ల ప్రజలు సానుకూలంగా లేరు. అయితే జిల్లాలోని ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కేసీఆర్ పట్ల లేదని సర్వేల ద్వారా తెలుసుకున్న తెరాస నాయకత్వం దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేసీఆర్ పై ప్రజలలో ఉన్న సానుకూలతను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని తేరాస నాయకులు ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేసీఆర్ కారణమని - కేసీఆర్ గెలుపు వల్లే తెలంగాణ మరింత అభివృద్ది చెందుతుందని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

అయితే ఈ వ్యూహంతో తెరాస నాయకులు ఎంత వరకూ నెగ్గుకు రాగలరు అన్నది ప్రశ్న అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2014 ఉద్యమ సమయంలో ఉన్న జోరు ఇప్పుడు తెలంగాణ ప్రజలలో లేదన్నది స్పష్టమవుతోంది. కేసీఆర్‌ పై తెలంగాణ ప్రజలలో ఎంత అభిమానం ఉన్నప్పటికి - గత నాలుగేళ్లలో కేసీఆర్ పై ఉన్న అభిమానం అన్నం పెట్టలేదని - తమ అవసరాలు కూడా తీర్చలేదని వారంటున్నారు. గతంలో తామూ ఓటు వేసినప్పుడు తమ నియోజవర్గంలోని అభ్యర్దిని చూసే తెరాసాను గెలిపించామని - తమ నియోజకవర్గంలోని అభ్యర్ది తమకు ఏదో మేలు చేస్తాడని ఓటు వేస్తే - తమ ప్రాంతం కనీస అభివృద్దికి కూడా నోచుకోలేదని వారంటున్నారు. కేసీఆర్‌ ను చూసి ఓట్లు వేసినప్పటికి - తమ నియోజక వర్గంలోని నాయకులు తమ సమస్యలును అధిష్టానం వరకూ తీసుకుని వెళ్లడంలోను విఫలమయ్యారని, అంతే కాకుండా తమ జిల్లాలో అభివృద్ది కూడా అనుకున్నంత జరగలేదని - వారంటున్నారు. అధిష్టానం తిరిగి సిట్టింగ్ ఎమ్మేల్యేలకే సీటు ఇచ్చిందని - అలాంటప్పుడు తెరాసాకి ఓటు వేసి మరోసారి మోసపోలేమని తెలంగాణ జిల్లాలలోని ప్రజలు వాపోతున్నారు. అయితే కేసీఆర్ నినాదంతో ప్రజలలోకి వేడితే అది "వన్ మ్యాన్ షో "గా మారిపోతుందని, ఇప్పటికే కుటుంబ పాలనపై విమర్శలు ఎదురుకుంటున్న కల్వకుంట్ల వారు - ఈ ప్రచారంతో విపక్షాలు విరుకుపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.